WorldWonders

బెంగుళూరు విమానాశ్రయంలో ₹75కోట్ల డ్రగ్స్ పట్టివేత-NewsRoundup-Mar 16 2025

బెంగుళూరు విమానాశ్రయంలో ₹75కోట్ల డ్రగ్స్ పట్టివేత-NewsRoundup-Mar 16 2025

* కర్ణాటక (Karnataka)లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్‌ చేశారు. డ్రగ్స్‌(Drugs) అక్రమరవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా (31), అబిగైల్‌ అడోనిస్‌ (30)గా గుర్తించారు. దిల్లీ నుంచి ఎండీఎంఏను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ అనుపమ్‌ అగర్వాల్‌ మీడియాకు వెల్లడించారు. అలాగే, వీరి నుంచి మొబైల్‌ ఫోన్లు, పాస్‌పోర్టులతో పాటు రూ.18వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

* విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్‌ఫ్రిడ్‌మ్యాన్‌ (Lex Fridman) పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు.

* ఈనెల 28వ తేదీన విడుదల కానున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని చిత్ర కథానాయకుడు నితిన్ కోరారు. సినిమాలో ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను జోడించామని చెప్పారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారని తెలిపారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది.

* మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) భారత్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న వేళ.. మన దేశంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని కొనియాడారు. మూడేళ్లలో మూడోసారి భారత పర్యటనకు రానున్నట్లు బిల్‌గేట్స్‌ లింక్డిన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో నిర్మూలనను ప్రశంసించారు. 2011లో భారత్‌ చివరి పోలియో కేసును నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హెచ్‌ఐవీ నివారణకు చేపడుతున్న అవాహన్‌ వంటి కార్యక్రమాల్ని కొనియాడారు. నేడు క్షయవ్యాధి (TB)పై భారత్‌ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.

* పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు జయప్రదంగా పదో తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లితండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.

* కేవలం ఒక్క మార్కు తక్కువగా వచ్చిందన్న కారణంతో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇష్టమైన సైన్స్‌ కోర్సును వదిలేసి ఆర్ట్స్‌లో చేరింది ఓ విద్యార్థిని. తన సోదరుల చదువు విషయంలో మాత్రం కన్నవారు ఇలాంటి ఆంక్షలేమీ పెట్టలేదంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నీటిపర్యంతమైంది. ఈ విషయం కాస్త కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలికకు ఫోన్‌ చేసి.. సైన్స్‌ కోర్సులో చేర్పిస్తానంటూ భరోసా కల్పించారు. బిహార్‌లోని దానాపుర్‌కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థిని కథ ఇది..! సంబంధిత ఇంటర్వ్యూలో ఖుష్బూ వెల్లడించిన వివరాల ప్రకారం.. 10వ తరగతి పరీక్షల్లో 500కు 400 మార్కులు తెచ్చుకోవాలని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే, 399 మార్కులు వచ్చాయి. దీంతో తనను సైన్స్‌ కోర్సు తీసుకోనీయకుండా, ఆర్ట్స్‌లో చేర్పించారంటూ ఖుష్బూ వాపోయింది. ఇంట్లో తనపట్ల ఎంతో పక్షపాతం చూపుతారని ఆరోపించింది. తన సోదరులకు సైన్స్ చదివే అవకాశం లభించిందని.. తాను మాత్రం కేవలం ఒక్క మార్కుతో ఇష్టమైన కోర్సుకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

* భాజపా పుట్టిందే దేశ రాజకీయాల్లో మార్పు కోసమని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఏర్పాటు చేసిన మీట్ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరోమారు దేశానికి అపార చాణుక్యుడిగా అమిత్ షా ఉన్నారని తెలిపారు. నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధాని కావడానికి అన్నితానై వ్యవహరించారన్నారు. దక్షిణ భారతదేశం నుంచి మొదలుకొని ఉత్తర్‌ప్రదేశ్‌ వరకు రకరకాల పేర్లతో పిలవబడే ఆర్యవైశ్యులు.. సామాజిక సేవలో ముందుంటారని పేర్కొన్నారు. ఆర్థికంగా బలంగా ఉండే ఆర్యవైశ్యులు రాజకీయాల్లో మరింత రాణించాలని, దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేది రాజకీయనాయకులేననే విషయాన్ని గ్రహించాలని కోరారు.

* ఈ రాష్ట్రానికి శ‌నిలాంటి సీఎం రేవంత్ రెడ్డిని దించేదాకా.. కేసీఆర్‌ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేసేదాకా నేను, కేటీఆర్ పోటీ ప‌డి ప‌ని చేస్తామ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. మా మ‌ధ్య ఎలాంటి కుమ్ములాట‌లు లేవు అని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. ప్ర‌తిప‌క్ష ప‌ద‌వి కోసం నేను కేటీఆర్ కొట్లాడుతున్నామ‌ట‌. మేం ఉద్య‌మ‌కారులం. కేసీఆర్ ఆదేశాల‌తోని మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాను. కేసీఆర్ ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించే క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌లం మేమిద్దరం. నీకు అల‌వాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక్కొక్క‌రిని తొక్కుకుంటూ, సీనియ‌ర్ల మీద సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు పెట్టి.. రూ. 50 కోట్ల‌కు ప‌ద‌వి కొనుక్కున్న‌వ్. ఈ విష‌యం కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చెప్పిందే అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

* ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్‌ (Sambhal)లో గల మొఘల్‌ కాలం నాటి షాహీ జామా మసీదు (Shahi Jama Masjid)కు పెయింటింగ్‌ (Whitewashing) పనులు ప్రారంభమయ్యాయి. ఈ మసీదు బయటి గోడలకు రంగులు వేసేందుకు హైకోర్టు పర్మిషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులు రంగులు వేసే పనిని నేటి నుంచి ప్రారంభించారు.

* సాంకేతిక సమస్యతో ఎయిర్‌ ఏషియా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కౌలాలంపూర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యను గుర్తించి ఫైలెట్‌ శంషాబాద్‌ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఏటీసీ అధికారులు ఎయిర్‌ ఏషియా విమానం ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఫైలెట్‌ సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తల్లెత్తకుండా సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడంతో అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాని జీఎంఆర్‌ అధికారులు మాత్రం అత్యవసరంగా ల్యాండింగ్‌ కాదు సాధారణంగానే ల్యాండింగ్‌ చేశారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని ప్రకటించారు.

* తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవుదినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు. స్వామివారి దర్శానానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో స్వామివారి సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 82,580 మంది భక్తులు దర్శించుకోగా 31,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి ( Hundi ) రూ 4 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

* ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువయ్యిందని టీటీడీ మాజీ చైర్మన్‌ , వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్‌ రెడ్డి ( Bhumana Karunakar Reddy ) ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశీనాయన ( Kasinayana ) క్షేత్రాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ( Chandra babu) గాని, సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ( Pawankalyan ) కాశీనాయనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనాందుల గొంతుక ఎందుకు మూగబోయిందని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z