Business

అమెరికాలో మాంద్యం…ఇండియాకు ఎలా సంకటం?-BusinessNews-Mar 16 2025

అమెరికాలో మాంద్యం…ఇండియాకు ఎలా సంకటం?-BusinessNews-Mar 16 2025

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో గట్టి పోటీ నెలకొంది. ఏఐ రేసులో నిలబడేందుకు ఇప్పటికే అనేక సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చైనా అతిపెద్ద సెర్చింజిన్‌ బైదూ (Baidu) రెండు కొత్త కృత్రిమ మేధ (Artificial Intelligence) మోడళ్లను లాంచ్‌ చేసింది. ERNIE 4.5, X1 అనే రెండు కొత్త రీజనింగ్‌ ఫోకస్డ్‌ మోడళ్లను తీసుకొచ్చినట్లు ఆదివారం తెలిపింది. అద్భుతమైన మల్టీమోడల్‌ సామర్థ్యంతో ERNIE 4.5 మోడల్‌ను తీసుకొచ్చినట్లు బైదూ తెలిపింది. అధునాతన భాషా సామర్థ్యాన్ని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకొనే సత్తా, అద్భుతమైన మెమోరీ కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అధిక ఐక్యూ కలిగిఉందని వెల్లడించింది. ఈ మల్టీమోడల్‌ ఏఐ సిస్టమ్‌లు టెక్ట్స్‌, వీడియో, ఇమేజెస్‌, ఆడియోతో సహా వివిధ రకాల డేటాను ప్రాపెస్‌ చేయగలవని తెలిపింది. ఇక ఎక్స్‌1 మోడల్‌కు సమర్థవంతమైన విషయాన్ని అవగాహన చేసుకొనే సత్తా, ప్రణాళికలు రచించే సామర్థ్యాల్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇది స్వయంప్రతిపత్తిగా ఉపయోగించే ఫస్ట్‌ డీప్‌ థింకింగ్‌ మోడళ్లలో ఒకటి అని బైదూ పేర్కొంది.

* అమెరికాలో మాంద్యం వస్తే.. మనదేశంపై కొన్ని అంశాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని అంశాల్లో పరోక్షంగా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ ఉండే భారతీయుల ఉద్యోగాలు పోవచ్చు. ఫలితంగా అక్కడ నుంచి మన దేశంలోని తల్లిదండ్రులు, ఆత్మీయులకు వారు పంపే నిధులు (రెమిటెన్సెస్‌) తగ్గిపోవచ్చు. అక్కడి వాణిజ్య సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించొచ్చు. ఇందువల్ల మన ఐటీ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. మాంద్యం భయాల మధ్య కోఫోర్జ్, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు ఇప్పటికే నష్టపోయాయి. ఫిబ్రవరిలో మన ఎగుమతులు తగ్గాయి. అమెరికాలో మాంద్యం వస్తే మరింత తగ్గొచ్చు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ప్రభావం వల్ల అంతర్జాతీయ మందగమనమూ ఏర్పడొచ్చు. ఈ ఏడాది ఆసియాలో అత్యంత అధ్వాన పనితీరు కనబరుస్తున్న రూపాయిపై మరింత ఒత్తిడి పడొచ్చు. టారిఫ్‌లు, మాంద్యం కలిసి.. స్టాక్‌ మార్కెట్లు మరింత ఊగిసలాటకు దారితీయొచ్చు. విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలు, కరెన్సీ విలువల్లో భారీ అనిశ్చితి కనిపించొచ్చు.

* భారతదేశ ఫారెక్స్‌ నిలువలు భారీగా పెరిగాయి. గతవారం ఫారెక్స్‌ నిల్వలు 15.267 బిలియన్లు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా పేర్కొంది. దాంతో దేశం మొత్తం విదేశీ మారక ద్రవ్య నిలువలు 653.966 బిలియన్లకు చేరాయి. గత మూడేళ్లలో ఒక వారంలో అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. దాదాపు నాలుగు నెలలుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల 11 నెలల కనిష్ఠానికి చేరుకున్నది. ఆ తర్వాత హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. గత సంవత్సరం సెప్టెంబర్ మొదటల్లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 704.89 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి ఫారెక్స్‌ నిలువలు వరుసగా తగ్గుతూ వచ్చాయి.

* ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు. భారతదేశంలో కూడా బిలినీయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న.. విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ వంటివి ఉన్నాయి. లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక.. 2025లో టాప్ 10 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను వెల్లడించింది.

➤టాటా గ్రూప్: 31.6 బిలియన్ డాలర్లు
➤ఇన్ఫోసిస్: 16.3 బిలియన్ డాలర్లు
➤హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్: 14.2 బిలియన్ డాలర్లు
➤ఎల్‌ఐసీ: 13.3 బిలియన్ డాలర్లు
➤రిలయన్స్ గ్రూప్: 9.8 బిలియన్ డాలర్లు
➤ఎస్‌బీఐ గ్రూప్: 9.6 బిలియన్ డాలర్లు
➤హెచ్‌సీఎల్‌టెక్: 8.9 బిలియన్ డాలర్లు
➤ఎయిర్‌టెల్: 7.7 బిలియన్ డాలర్లు
➤లార్సెన్ & టూబ్రో: 7.4 బిలియన్ డాలర్లు
➤మహీంద్రా గ్రూప్: 7.2 బిలియన్ డాలర్లు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z