Kids

వరంగల్ కిలాడి లేడీ…బాలికలు మాయం-NewsRoundup-Mar 17 2025

వరంగల్ కిలాడి లేడీ…బాలికలు మాయం-NewsRoundup-Mar 17 2025

* ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను ఎవరూ ఓడించలేదని.. తాను తీసుకున్న వివిధ నిర్ణయాల వల్ల ఓటమికి తానే కారణమని అన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా.. సంపద సృష్టే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రజలు సైతం రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

* అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్‌ పవిత్రాదేవికి ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రి చెప్యాలకు చెందిన రోహిత్‌ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటే అమెరికాలో ఉంటున్నారు. సోమవారం రోహిత్ రెడ్డి తన భార్య ప్రగతి రెడ్డి(35), తల్లి సునీత రెడ్డి (56), ఇద్దరు కుమారులతో కారులో షాపింగ్‌కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రగతి రెడ్డి, సునీత రెడ్డి, అర్విన్‌ (8) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న రోహిత్ రెడ్డి, అతని చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీపై (Mamata Banerjee) తీవ్ర విమర్శలు గుప్పించారు. హోలీ సందర్భంగా బెంగాల్‌లో చోటు చేసుకున్న ఘర్షణలను ఆయన ఎత్తి చూపుతూ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సీఎం మమతా కాపాడుకోలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. పండుగ రోజు బెంగాల్‌లోని బీర్భమ్‌లో రెండు వర్గాలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన సీఎం యోగి.. దీదీ పాలనను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. ‘‘ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో తొక్కిసలాట ఘటనను ఉద్దేశిస్తూ ఇటీవల మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరణోత్సవమంటూ తక్కువ చేసి మాట్లాడారు. కానీ, ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన రెండు వర్గాల మధ్య పోరును అడ్డుకోలేకపోయింది’’ అని యోగి ఆదిత్యనాథ్‌ విమర్శల బాణాలు సంధించారు. ‘‘మహాకుంభ మేళాలో మొత్తం 66 కోట్లకు పైగా మంది భక్తులు పాల్గొన్నారు. కానీ, ఒక్క నేరం కూడా జరగలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించే సామర్థ్యం యూపీ ప్రభుత్వానికి ఉంది. కానీ, బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. మా రాష్ట్రంలో హోలీని ఎంతో ఆనందం నిర్వహించాం. అయితే.. దీదీ ప్రభుత్వం మాత్రం పండుగల వేళ కర్ఫ్యూలు విధించే పరిస్థితి నెలకొంది. ప్రజలపై ఆంక్షలు విధిస్తుంటుంది. అయినప్పటికీ, నేరాలు నివారించలేకపోయింది. ప్రజల మనోభావాలను గుర్తించి గౌరవించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. పాలన అంటే విభజించడం కాదు. చెడు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు ఉండవు’’ అని హితవు పలికారు.

* తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు రెడ్డప్పరెడ్డి (ఏ5)ని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు వివరాలను చిత్తూరు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకే రామకృష్ణను హత్య చేశారు. నిందితుడు రెడ్డప్పరెడ్డి.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు. హత్యకు ముందు వైకాపా ముఖ్య నేతలతో నిందితుడు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించాం. నిందితులు భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. వీరి అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకే హత్య చేసినట్లు అనుమానిస్తున్నాం’’ అని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని పుంగనూరు మండలం కృష్ణాపురంలో మార్చి 15న రామకృష్ణను హత్య చేసిన విషయం తెలిసిందే.

* వైకాపా హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చించే ధైర్యం ఆ పార్టీ సభ్యులకు ఉందా? అని మంత్రి నారా లోకేశ్‌ సవాల్ విసిరారు. అవకతవకలపై చర్చకు బీఏసీలో అంగీకరించిన వైకాపా సభ్యులు.. శాసనమండలికి వచ్చాక పదే పదే వాకౌట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని లోకేశ్‌ నిలదీశారు. మార్షల్స్‌కు చెప్పి బయట ఉన్న సభ్యులను సభలోకి రప్పించేలా కౌన్సి్‌ల్ ఛైక్మన్‌ ఆదేశాలివ్వాలని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

* వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్‌ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది.

* దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actress Ranya Rao) కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రన్యతో తనకు గత నవంబరులో వివాహమైందని, అయితే డిసెంబర్ నుంచే తాము విడిగా ఉంటున్నామని ఆమె భర్త జతిన్‌ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు.

* ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth reddy) ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం అన్నారు. తొలి ఏడాదిలోనే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు 1.20 కోట్ల నాణ్యమైన చీరలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

* వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

* భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్‌ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె.

* అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా. ఇందుకోసం ఇన్‌ స్టాగ్రామ్‌ను వినియోగించింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ట్రెండింగ్‌ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్‌ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్‌ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్‌ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది. ఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్‌ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z