* భాజపా ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. అక్రమ్ గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, దిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఎంపీ ఇంటికి చేరుకుని వివరాలను సేకరించిన విషయం తెలిసిందే.
* గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంట్లో దాదాపు 100 కిలోల పుత్తడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై ఇటీవల పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్‌మెంట్‌లో దాచిపెట్టినట్లు తెలిసింది. దీంతో ఈ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఏటీఎస్ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో భారీగా పుత్తడి బయటపడింది. ఆ ఇంట్లో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలలో పసిడి ఆభరణాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
* యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని మిస్ యూనివర్స్ (Miss Universe 2024) విక్టోరియా కెజార్ హెల్విగ్ దర్శించుకున్నారు. డెన్మార్క్‌కు చెందిన ఆమె భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి వచ్చారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
* తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ వెంకట్రామిరెడ్డికి రూ.కోటి జరిమానా విధించారు. బండ్లగూడ మండలం కందికల్‌లో సర్వే నెంబర్ 310/1, 310/2లలో 9.11 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని వెంకట్రామిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కందగట్ల ధీరజ్ వాదనలు వినిపించారు. భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ బండ్లగూడ తహశీల్దార్ లేఖ రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తన భూమిని సేల్ డీడ్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు.
* ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI), ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సందు, వివేక్ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి (న్యాయ మంత్రిత్వశాఖ), ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు.
* దేశవ్యాప్త సమ్మెకు (Nationwide strike) పలు కార్మిక సంఘాలు (Trade unions) పిలుపునిచ్చాయి. మే 20న ఈ సమ్మె జరగనుంది. లేబర్ కోడ్ రద్దు చేయడం, ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలనే డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహించనున్నాయి. నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం కూడా సంఘాల డిమాండ్లలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి.. దాని ద్వారా ఏ పథకం కిందకు రాని వారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్లు వినిపించనున్నారు.
* వైకాపా నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని.. ఆమె కుమారులని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించటంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చారు.
* తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూముల గురించి తెలిసేలా సంబంధిత కార్యాలయాల్లో వివరాలు తెలిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి చంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టప్రకారం ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములను రెవెన్యూ కార్యాలయాలతో పాటు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ప్రచురించి అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని చంద్రసేనారెడ్డి కోర్టును కోరారు. దీనివల్ల అమాయకులు వివాదాస్పద భూములు, భవనాలను కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడతారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
* హైదరాబాద్ మహానగరం చుట్టూ నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్ గురించి కేంద్ర మంత్రి గడ్కరీతో తో చర్చలు జరిపినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ పూర్తి చేసి పంపుతామని చెప్పినట్లు వెల్లడించారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. భారాస మాదిరిగా తమకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదని విమర్శించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్ గురించి కేంద్ర మంత్రి గడ్కరీని ఏడుసార్లు కలిశాను. రెండు నెలల్లో పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో దీనిని పూర్తి చేస్తాం’’ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z