* ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తన నెట్వర్క్ సేవల్ని మరింత మెరుగుపరుచుకొనేందుకు చాలా కాలంగా కృషి చేస్తోంది. యూజర్లందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందించాలని చూస్తోంది. అందులో భాగంగానే ఎలాన్‌మస్క్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్తో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. తన సర్వీస్ నాణ్యతను మెరుగుపరిచుకొని, టెలికాం సేవల్ని మరింత విస్తరించడానికి స్పేస్ఎక్స్తో పాటు ఇతర శాట్‌కామ్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ విషయంపై కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్‌సింగ్ ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. కంపెనీ వ్యూహంలో భాగంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. నెట్వర్క్ విస్తరణకు సరైన భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు.
* చిన్న మొత్తంలో జరిపే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1500 కోట్లు కేటాయించింది. తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ ప్రోత్సాహకాల కింద రూ.1500 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. యూపీఐ లావాదేవీలు అనుమతించినందుకు గానూ చిన్న వ్యాపారులు ఒక్కో లావాదేవీకి 0.15 శాతం చొప్పున ప్రోత్సాహం కింద అందుకుంటారు. ఆపై మొత్తాలపై ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు వర్తించడం లేదు. వచ్చే ఏడాదీ ఈ స్కీమ్ కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
* బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రాశ్చంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు సంబంధించిన అనిశ్చిత కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో డిమాండ్ పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మనీష్ మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య యుద్ధం భాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. గత 210 రోజుల్లో బంగారం ధర ఔన్స్‌కు 2500 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెరిగింది.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు. అంతకు ముందు రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) చైర్మన్ అశోక్ హిందుజా వెల్లడించారు. బిడ్ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్‌పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.
* అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)పై దాడులు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా లాస్ వెగాస్ (Las Vegas)లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అంతేకాదు, ఓ కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు కాన్సాస్ సిటీ (Kansas City)లో రెండు టెస్లా సైబర్ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు. దక్షిణ కొరోలినాలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనలపై టెస్లా బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. తన సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులకు కారకులైన వారిని ఏమీ చేయలేదంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆయా ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z