Business

ఇండియా మార్కెట్‌లోకి లిల్లీ మధుమేహం మందు-BusinessNews-Mar 20 2025

ఇండియా మార్కెట్‌లోకి లిల్లీ మధుమేహం మందు-BusinessNews-Mar 20 2025

* ఊబకాయం (Obesity), మధుమేహంతో (Type 2 diabetes) బాధపడేవారికి ఊరట కలిగించే వార్త. వీటికి సంబంధించి భారత్‌లో తొలిసారిగా ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలీ లిల్లీ సంస్థ వెల్లడించింది. మౌంజారో (Mounjaro) బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి లభించిందని పేర్కొంది. మౌంజారో సింగిల్‌ డోసు బాటిల్‌లో లభిస్తుంది. 2.5మి.గ్రా ధర రూ.3500 కాగా.. 5 మి.గ్రా రూ.4375 ఉన్నట్లు తెలుస్తోంది. మధుమేహం, బరువు తగ్గించే (Weight Loss) చికిత్సలో ఉపయోగించే ఈ మౌంజారో ఔషధం టిర్జెపటైడ్‌ (tirzepatide) పేరుతో బ్రిటన్‌, యూరప్‌ దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. అమెరికాలో మాత్రం జెఫ్‌బౌండ్‌ పేరుతో విక్రయిస్తున్నారు. కాగా భారత్‌లో మాత్రం ఇదే మొట్టమొదటిది. జీఐపీ (గ్లూకోజ్‌ ఆధారిత ఇన్సులినోట్రోపిక్‌ పోలిపెప్టైడ్‌), జీఎల్‌పీ-1 (గ్లూకాగాన్‌ మాదిరి పెప్టైడ్‌) హార్మోన్‌ గ్రాహకాలను ఉత్తేజపరచడం ద్వారా మౌంజారో పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.

* ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది.

* ఓ నగరాన్ని తలపించేలా చైనాలో (China) ఓ ఫ్యాక్టరీ భారీ విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతోందట. ఇప్పటికే అనేక నిర్మాణాలు పూర్తికాగా.. మరిన్ని దశల్లో విస్తరణ కొనసాగించనుందని తెలిసింది. నిర్మాణం పూర్తయితే దీని విస్తీర్ణం అమెరికాలోని ఓ నగరం కంటే పెద్దగా ఉంటుందని చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఓ డ్రోన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles) తయారీ సంస్థ బీవైడీ.. హెనాన్‌ ప్రావిన్సులోని జెంగ్‌ఝౌలో ఓ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఎనిమిది దశల్లో దీనిని పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుందట. దాదాపు 32వేల ఎకరాల్లో నిర్మాణం చేపడుతుందని తెలిసింది. బ్లాక్‌ల వారీగా అనేక భవనాలు, ఓ ఫుట్‌బాల్‌ మైదానం, టెన్నిస్‌ కోర్టులు.. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ రోడ్లు.. ఇలా అనేక సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తైతే అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరం కంటే పెద్దగా కనిపిస్తుందని అంచనా.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభాల పరుగు కొనసాగుతోంది. బెంచ్‌ మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ.. ఈ ఏడాది రెండుసార్లు కీలక రేట్ల కోత ఉంటుందని సంకేతాలివ్వడం మన మార్కెట్లకు బూస్ట్‌ ఇచ్చినట్లయ్యింది. దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ కూడా 23,200 స్థాయిని దాటింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు మాత్రం స్వల్ప స్థాయిలోనే కదలాడాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3 లక్షల కోట్ల మేర పెరిగి రూ.408 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 75,917.11 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,449.05) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 76,456.25 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 899.01 పాయింట్ల లాభంతో 76,348.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 283.05 పాయింట్ల మేర లాభంతో 22,190.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.33గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3049 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* వైర్లు, కేబుళ్ల విభాగంలోకి బిగ్‌ ప్లేయర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఈ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. తాజాగా అదానీ గ్రూప్‌ కూడా ఈ రంగంలో తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా జాయింట్‌ వెంచర్‌ని ఏర్పాటు చేసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈనేపథ్యంలో మార్కెట్‌లో ఇప్పటికే ప్రధాన ప్లేయర్లుగా ఉన్న పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఆర్‌ఆర్‌ కేబుల్‌ లిమిటెడ్‌, ఫినోలాక్స్‌ కేబుల్స్‌, హావెల్స్‌ ఇండియా లిమిటెడ్‌ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

* బంగారం ధరలు రోజుకో రికార్డును నెలకొల్పుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో బుధవారం మరో సరికొత్త స్థాయిని గోల్డ్‌ రేటు అందుకున్నది. 24 క్యారెట్‌ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు ఆల్‌టైమ్‌ హైని తాకుతూ రూ.92 వేలను సమీపించింది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో ఏకంగా రూ.91,950గా నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే రూ.700 ఎగిసింది. గత 6 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉండగా.. ఈ మూడు రోజుల్లోనే తులం రూ.2,500 ఎగబాకడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z