NRI-NRT

H1B దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోండి-NewsRoundup-Mar 20 2025

H1B దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోండి-NewsRoundup-Mar 20 2025

* భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులు తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్, ధన శ్రీ ఇవాళ మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) గడువును బాంబే హైకోర్టు రద్దుచేసింది. మార్చి 20లోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఆ మొత్తంలో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

* బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పేరు కూడా రావడం, కేసు నమోదైన నేపథ్యంలో ఆయన టీమ్‌ వివరణ ఇచ్చింది. కేవలం స్కిల్‌ బేస్డ్‌ గేమ్స్‌కు మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారని తెలిపింది. ఆ కంపెనీ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

* వైకాపా(YSRCP)కు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా? అంటూ సభ్యులను స్పీకర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరుకావాల్సి ఉందన్నారు. వైకాపా సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు.

* న్యూజెర్సీ మేయర్ గినాలాప్లాసా మద్యం మత్తులో వాహనం నడిపి, అరెస్టయ్యారు. ఆమె మద్యం సేవించి, డేకేర్ సెంటర్ నుంచి తన రెండేళ్ల కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమె రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారు. తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఈ దృశ్యాలన్నింటిని ప్రత్యక్ష సాక్షి ఒకరు తన కెమెరాలో బంధించారు. ఆ క్లిప్‌లో కారుసీటులో పిల్లాడు కనిపించాడు. ఆ దృశ్యాలు తమ దృష్టికి చేరడంతో పోలీసులు మేయర్ కారును అనుసరించి, ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె కారులో మద్యం సీసాను గుర్తించారు. ఆల్కహాల్ టెస్టులో పాజిటివ్ రావడంతో అరెస్టు చేశారు.

* ఎన్నో ఏళ్లుగా విద్యార్థినులపై లైంగిక ఘోరాలకు పాల్పడుతున్న ఓ కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినుల పట్ల నీచ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఇటీవల పరారైన ప్రొఫెసర్‌ రజనీష్‌ కుమార్‌ (50)ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. హాథ్రస్‌లోని సేథ్‌ ఫూల్‌ చంద్‌ బాగ్లా పీజీ కాలేజీలో చీఫ్‌ ప్రొక్టర్‌గా పనిచేస్తున్న రజనీష్‌ కుమార్‌ విద్యార్థినులను లోబరుచుకొని.. దారుణాలకు ఒడిగట్టిన వీడియోలు తీస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వీడియోలు తీసుకొని అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. అయితే, ఎంతమంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో తనకు తెలియదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. 2009లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడగా.. అది అనుకోకుండా వెబ్‌కెమెరాలో రికార్డు అయిందని.. అప్పుడే మిగతా మహిళల వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేయాలన్న ఆలోచన తనకు వచ్చిందని పోలీసులకు వివరించాడు. అలా.. కొన్నేళ్ల క్రితం నుంచే లైంగిక దాడి దృశ్యాలను రికార్డు చేయడం ప్రారంభించానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వారిని నోరు విప్పకుండా చేసేందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు.

* నైపుణ్యఆధారిత గేమ్‌లకు మాత్రమే నటుడు రానా (Rana) ప్రచారకర్తగా వ్యవహరించారని ఆయన టీమ్‌ తెలిపింది. బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేయడం, ఈ యాప్‌లకు పనిచేసిన వారిని విచారణకు పిలవడంతో తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో రానా పేరు కూడా చేర్చడంతో ఆయన టీమ్‌ వివరణ ఇచ్చింది. రానా చేసిన ప్రకటన గడువు 2017లోనే ముగిసిందని ప్రకటించింది.

* విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ‘ఏమంటివి..ఏమంటివి?’ అంటూ దానవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్‌ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని రఘురామకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు పవన్‌, మంత్రి నారా లోకేశ్‌ చప్పట్లతో అభినందించారు.

* బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంపై హైదరాబాద్‌ పోలీసులు విచారణ, దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నారు. నటులు విష్ణు ప్రియ (Vishnu Priya), రీతూ చౌదరి(Ritu Chaudhary)లను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇద్దరినీ ఒకే గదిలో ఉంచి, విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తాను మూడు బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసినట్లు విచారణలో విష్ణుప్రియ ఒప్పుకొంది. అయితే, ‘మీరు 15 యాప్‌లకు ప్రచారం చేసినట్లు సమాచారం ఉంది’ అని పోలీసులు అడగ్గా ‘నాకు గుర్తు లేదు. కేవలం మూడు మాత్రమే గుర్తున్నాయి’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ వివరాలను అడిగి తీసుకుంటున్నారు. మరోసారి విచారణకు హాజరైతే అప్పుడు పూర్తి బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు సమాచారం.

* తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అతడు మెల్‌బోర్న్‌ టెస్టులో సూపర్‌ సెంచరీతో (AUS vs IND) జట్టును ఫాల్ ఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలో టెస్టు కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ (Nitish Kumar Reddy) తొలి బంతి నుంచి నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) గిప్ట్‌గా ఇచ్చిన షూస్ వేసుకుని శతకం సాధించినట్లు నితీశ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘లాకర్‌ రూంలో కోహ్లీ.. సర్ఫరాజ్‌ ఖాన్‌ను (Sarfaraz Khan), నీ షూ సైజ్‌ ఎంత అని అడిగాడు. దానికి సర్ఫరాజ్‌ 9 అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు కోహ్లీ నా వైపు తిరిగాడు. నాకు చాలా ఆనందం వేసింది. నా సైజ్‌ షూస్‌ కాకపోయినా సరే… విరాట్‌ బూట్లు నాకు కావాలి అని మనసులో అనుకున్నాను. నా షూ సైజ్ అడిగిన వెంటనే నేను 10 అని చెప్పా. కోహ్లీ తన షూస్‌ నాకు ఇచ్చాడు. తర్వాత జరిగిన మ్యాచ్‌లో నేను ఆ బూట్లతోనే ఆడి సెంచరీ సాధించాను’ అని తెలుగుతేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy) ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అన్నాడు.

* క్షణికావేశంలో ఓ భక్తుడు మరో ఇద్దరు భక్తులపై గాజు వాటర్‌ బాటిల్‌తో దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం తిరుమలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన గోవిందరాజు, హంపయ్య తమ కుటుంబంలోని 13 మందితో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. స్థానిక సీఆర్వో కేంద్రం వద్ద గదుల కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ తన కుమారుడితో కలిసి సీఆర్వో ఆఫీసు వద్దకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ కుర్చీలో ఉన్న లగేజీని పక్కన పెట్టి బాబును కూర్చోబెట్టడంతో ఇద్దరు భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన కుమారుడిని తోసేశారనే కోపంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో కార్తికేయ.. సమీపంలోని గాజు వాటర్‌ బాటిల్‌తో గోవిందరాజు తలపై కొట్టాడు. పక్కనే ఉన్న హంపయ్యకు కూడా గాజు పెంకులు గుచ్చుకుని గాయాలయ్యాయి. సమీపంలోని భద్రతా సిబ్బంది క్షతగాత్రులను తితిదే అశ్విని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్‌ పీఎస్‌ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇరువురినీ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

* అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వలసల అంశంపై ప్రత్యేక దృష్టిసారించారు అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఈ క్రమంలోనే తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 20 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది. దీంతో హెచ్‌-1బీ వీసా (H-1B visa) ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్‌ నుంచి తొలగించనున్నారు. అంటే.. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే.. ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.

* విశాఖపట్నం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z