Business

అమెజాన్‌లో కొనాలంటే ఎక్కువ చెల్లించాలి-BusinessNews-Mar 21 2025

అమెజాన్‌లో కొనాలంటే ఎక్కువ చెల్లించాలి-BusinessNews-Mar 21 2025

* ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కొత్త తరహా ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తోంది. ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ రూ.500 దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుంచి మినహాయిస్తోంది. మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఈ తరహా ఫీజు వసూలు చేస్తోంది. ఇప్పుడు అమెజాన్‌ కూడా దీనికి శ్రీకారం చుట్టింది. ఉదాహరణకు మీరు రూ.10 వేలు విలువైన వస్తువును కొనుగోలు చేశారనుకుందాం. బ్యాంక్‌ ద్వారా మీకు వెయ్యి రూపాయలు డిస్కౌంట్‌ లభిస్తే.. వాస్తవంగా రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూ.49 ప్రాసెసింగ్‌ ఫీజు కలుపుకొంటే డిస్కౌంట్‌ తర్వాత ధర రూ.9049 చెల్లించాల్సి ఉంటుంది.

* స్టాక్‌ మార్కెట్లో బుల్‌ రన్‌ కొనసాగుతోంది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడంతో వరుసగా ఐదో రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. చాలా కాలం తర్వాత స్మాల్‌ క్యాప్‌, మిడ్ క్యాప్‌ స్టాక్‌లు పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. వరుసగా విక్రయదారులుగా నిలిచిన విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లకు దిగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 76,155.00 (క్రితం ముగింపు 76,348.06) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. 76,095.26 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ కాసేపు లాభ- నష్టాల మధ్య కదలాడింది. తొలుత నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ప్రధాన షేర్ల అండతో లాభాల బాటపట్టింది. ఇంట్రాడేలో 77,041.94 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 557 పాయింట్ల లాభంతో 76,905.51 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో సూచీ 23,402.70 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 159 పాయింట్ల లాభంతో 23,350.40 వద్ద స్థిరపడింది.

* గుజరాత్‌లోని ‘ఉకై’ సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి రూ.7,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) శుక్రవారం తెలిపింది. గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్(GSECL) ద్వారా ఈ ఆర్డర్‌ పొందినట్లు ‘బిహెచ్‌ఇఎల్‌’ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్‌ 54 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. గుజరాత్‌లోని తాపి జిల్లాలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ & కన్స్ట్రక్షన్(EPC) ప్రాతిపదికన 1×800 MW ‘ఉకై’ సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ (యూనిట్-7)ను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ కింద BHEL ఈ ఆర్డర్‌ను పొందింది.

* సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌లైన పెప్సీ, కోకాకోలా కొత్త వ్యూహాలకు పదునుపెట్టాయి. రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) తీసుకొచ్చిన సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా (campa) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో.. పెప్సీ, కోకాకోలా తక్కువ ధరలో సాఫ్ట్‌ డ్రింక్స్‌ను తీసుకొచ్చాయి. రూ.10తో చిన్న ప్యాక్‌లో డైట్‌, లైట్‌ వేరియంట్‌లలో పానీయాలను అందుబాటులోకి తెచ్చాయి. కోకాకోలా, పెప్సీ ఇరు సంస్థలు థమ్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ ఫోర్స్‌, కోక్‌ జీరో, స్ప్రైట్‌ జీరో, పెప్సికో నో- షుగర్‌ అనే బ్రాండ్ల పేరుతో రూ.10కే డ్రింక్స్‌ను ప్రవేశపెట్టాయి. డైట్‌, లైట్‌ వేరియంట్లలో నో- షుగర్‌ పానీయాల్ని తీసుకొచ్చాయి. డైట్‌, లైట్‌ వేరియంట్లలో ఈ ధరలో భారత మార్కెట్లలోకి తీసుకురావడం ఇదే తొలిసారి అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. తక్కువ ధరలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో కంపెనీలు తమ ప్రధాన బ్రాండ్‌లపై ధరల తగ్గింపును నివారించేందుకు ప్రయత్నిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z