* కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్’ (Honey Trap) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) దద్దరిల్లింది. సమావేశాల వేళ ప్రతిపక్ష భాజపా నేతలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. దాంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది భాజపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ (BJP MLAs suspended) విధిస్తూ తీర్మానం చేశారు. ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
* వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
* క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ముంబయి కోర్టు గురువారం ఈ జంటకు విడాకులు మంజూరుచేసింది. ఈనేపథ్యంలోనే ధన శ్రీ కెరీర్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా తాజాగా ఆమె స్పెషల్ సాంగ్ విడుదల చేశారు. ‘దేఖా జీ దేఖా మైనే’ అంటూ సాగే ఈ పాటలో ఆమె గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డిపోర్టేషన్ (Deportation) ప్రక్రియ పాతదే అయినా ట్రంప్ హయాంలోనే ఎక్కువ మంది భారతీయులు వెనక్కి వచ్చినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 6వేల మంది వెనక్కి రాగా.. బైడెన్ (Joe Biden) పాలనలో ఈ సంఖ్య 3వేలుగా ఉండటం గమనార్హం.
* ఐపీఎల్ 2025 మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను అకస్మాత్తుగా టోర్నమెంట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. వేలంలో ఎంపికైన తర్వాత బ్రూక్ హాజరు కాకపోవడం వరుసగా ఇది రెండో సంవత్సరం. దీంతో బీసీసీఐ (BCCI) అతడు రెండు సీజన్ల పాటు ఐపీఎల్(IPL)లో ఆడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ (Michael Vaughan) సమర్థించాడు. సరైన కారణం లేకుండా హ్యారీ బ్రూక్ (Harry Brook) ఐపీఎల్‌కు హాజరు కానందువల్లే భారత క్రికెట్ బోర్డు ఈ చర్య తీసుకుందన్నాడు. ఆటగాళ్లకు నియమ నిబంధనల గురించి తెలిసే ఉంటుంది. ప్లేయర్లు ఆఖరి నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఫ్రాంఛైజీల ప్రణాళికలు గందరగోళానికి గురవుతాయని వాపోయాడు.
* రాజకీయంగా లబ్ధి పొందేందుకు, అవినీతిని దాచి పెట్టేందుకే కొన్ని పార్టీలు భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా వరకు విభజన వచ్చిందని, ఇకపై ఎంతమాత్రం జరగబోదని వ్యాఖ్యానించారు. హిందీ ఏ భాషకూ పోటీ కాదని, అన్ని భాషలకూ సోదర భాష అని పేర్కొనారు. ఈ మేరకు రాజ్యసభలో ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జాతీయ విద్యావిధానం, త్రిభాష అంశంపై వివాదం నెలకొన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది. కాకపోతే, ఈదురు గాలులు మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సామాన్యంగా ఉండడంతో పాటు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
* దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ 2025 మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతని భార్య అథియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటమే దీనికి కారణం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హిలీ ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా తెలిపారు. ‘హ్యారీ బ్రూక్ (Harry Brook) ఐపీఎల్ ఆడటం లేదు. దిల్లీ క్యాపిటల్స్‌లో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. అలాగే కేఎల్ రాహుల్ కూడా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోవచ్చు. అతడు తండ్రి కాబోతుండటమే దీనికి కారణం. జట్టు యువ ఆటగాళ్లతో బలంగానే ఉంది. అయినప్పటికీ కేఎల్ రాహుల్ టీ20 (T20)ల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాడు. అతని ఆట అద్భుతంగా ఉంటుంది’ అని ఆమె అన్నారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.
* మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వంద బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఐజీ ఈగల్ టీమ్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సైకోటిక్ మెడిసిన్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఆల్ఫ్రాజోలమ్, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.
* శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వెళ్లే నల్లమల ఘాట్ రోడ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మల బైలుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మలుపు వద్ద ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ రహదారి పైనే నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా వచ్చి పోయే వాహనాలన్నీ ఒక్కసారిగా ఘాట్ రోడ్‌లో ఆగిపోయాయి. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులే ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతో వాహనాలు ముందుకు కదిలాయి.
* టర్కిష్ ఐస్‌క్రీమ్ వెండర్లు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియాలో ప్రతి షాపింగ్ మాల్‌లో లేదా మెట్రో సీటీలలోని విధులలో కనిపిస్తుంటారు. కేవలం ఐస్‌క్రీమ్ అమ్మడం మాత్రమే కాదు, కస్టమర్లతో ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా ఒక ఆట ఆడుకుంటారు. ఐస్‌క్రీమ్ కోన్‌ను కస్టమర్‌కు ఇచ్చేలా చేసి, చివరి క్షణంలో దాన్ని తిరిగి లాగేసుకుంటారు. ఐస్‌క్రీమ్‌ను పైకి ఎత్తడం, తిప్పడం, లేదా కోన్‌ను ఖాళీగా ఇచ్చి ఆశ్చర్యపరచడం వంటివి చాలా వరకు వీడియోలలో చూసే ఉంటాము. అయితే టర్కిష్ ఐస్‌క్రీమ్ తిందాం అని షాప్‌కి వెళ్లిన స్టార్ నటి కీర్తి సురేష్‌ని చాలాసేపు ఆటపట్టించాడు ఒక ఐస్‌క్రీమ్ వెండర్. ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లే ఇచ్చి తీసుకోవడం. మళ్లీ కోన్ కీర్తి సురేశ్ చేతిలో పెట్టడం చేశాడు. చివరగా కీర్తి చేతిలో ఐస్‌క్రీమ్ పెట్టాడు. అయితే ఐస్‌క్రీమ్ ఇచ్చిన అనంతరం అసలు ఆటను చూపించింది కీర్తి సురేష్. తన వద్ద ఉన్న డబ్బులను తీసుకోమంటూ వాళ్లు వాడిన ట్రిక్ వారిమీదే ప్రయోగించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z