* స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంకిత్ అరోరాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 11 ఏటీఎం కార్డులు, 2 సెల్‌ఫోన్లు, 11 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ అరోరా స్టాక్ మార్కెట్ పేరుతో సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.1.22 కోట్లు కాజేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. అంకిత్‌ను అరెస్టు చేశారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా ఇప్పటికే 23 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
* సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటినుంచి కంపెనీలో ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేశారు. గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను ‘ఎక్స్’తో రీ బ్రాండ్ చేశారు. తాజాగా ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోకు ‘ఆర్‌ఆర్ ఆక్షన్’ సంస్థ వేలం నిర్వహించింది. ఈ వేలంలో లోగో 35వేల డాలర్లకు (దాదాపు రూ.30 లక్షలకు) అమ్ముడైంది.
* అకౌంటింగ్ లోపాల పరిణామం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీఈఓ సుమంత్ కత్పాలియా, డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానాలను బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అడిగినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంక్ డిపాజిట్‌దార్లలో అనవసర ఆందోళనలకు తావివ్వకుండా కత్పాలియా, ఖురానా బాధ్యతల నుంచి వైదొలగడం.. వారి స్థానంలో వెంటనే కొత్త అధికారుల నియామక ప్రక్రియ సాఫీగా జరగాలని ఆర్‌బీఐ భావిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. సీఈఓ, డిప్యూటీ సీఈఓ పదవుల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌తో సంబంధం లేని బయటి వ్యక్తులను నియమించాలని ఆర్‌బీఐ కోరుకుంటోందని తెలిపాయి. ఉన్నత స్థాయి పదవుల్లో నియామకాల కోసం బ్యాంకుల బోర్డులు సిఫారసు చేసే పేర్లకు ఆర్‌బీఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
* దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి మళ్లీ మొదలైంది. వచ్చేవారంలో ఏకంగా 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. అయితే ఈ అన్ని సంస్థలు ఎస్ఎంఈ విభాగం నుంచే రావడం గమనార్హం. ప్రధాన బోర్డు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతోపాటు ఇప్పటికే మార్కెట్ నుంచి నిధులు సమీకరణ పూర్తిచేసుకున్న ఐదు సంస్థలు వచ్చేవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
* ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశారని.. దాదాపు 2,400 బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేసినట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో అప్రమత్తంగా ఉండాలని.. వాటిని ఎవరూ వినియోగించొద్దని డీజీజీఐ సూచించింది. కొన్ని సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాన్ని దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకున్నామని.. 357 వైబ్‌సైట్స్‌ని ఐటీశాఖ సమన్వయంతో బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా వేసినట్లు పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z