* వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. పోసాని కృష్ణమురళికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి జి.స్పందన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా జైలు నుంచి అధికారులు పోసానిని విడుదల చేశారు.
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో పవన్ ఫ్యాన్స్ తనను ర్యాగింగ్ చేశారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె మాటలకు వేదికపైనున్న పవన్ సైతం చిరునవ్వులు చిందించారు. పంట కుంటల భూమి పూజ కోసం డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ ఎదుట బైరెడ్డి శబరి గతాన్ని గుర్తు చేసుకున్నారు. జన సైనికులు నిజంగా చాలా గట్టివారని పవన్ అన్నారు. వారు తెగించి పని చేసి కూటమికి అఖండ విజయాన్ని అందించారని ఆయన సమాధానం ఇచ్చారు.
* ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murthy) స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంగా చేయాలనుకుంటే సమయం ఎప్పుడూ పరిమితంగా మారదని ఆమె వ్యాఖ్యానించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘ప్రజలు ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంగా చేయాలనుకుంటే దానికి సమయం ఎప్పుడు పరిమితిగా మారదు. నా భర్త డబ్బులు లేని సమయంలో కూడా ఇన్ఫోసిస్ (Infosys)ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అంకితభావం కలిగిన వ్యక్తులతో కలిసి 70 గంటలు అంతకంటే ఎక్కువ సమయం పని చేయడం వల్లే అది సాధ్యమైంది. నా భర్త మాత్రమే కాదు.. జర్నలిస్టులు, డాక్టర్లు వంటి ఇతర రంగాల్లోని వారు కూడా 90 గంటలు పని చేస్తున్నారు. భగవంతుడు అందరికీ రోజుకి 24 గంటల సమయమే ఇచ్చాడు. దానిని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది మీ ఇష్టం’ అని సుధామూర్తి పేర్కొన్నారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించిన ‘గోల్డ్ కార్డు’కు భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజే 1000 కార్డులను (Gold Card) విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు. వీటి ద్వారా 5బిలియన్ డాలర్లు సేకరించామని చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటిద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందన్నారు.
* అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వలసల విషయంలో అమెరికా సర్కారు దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని దేశం నుంచి పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాత్కాలిక వలసదారులపైనా ట్రంప్ (Donald Trump) కన్నెర్ర చేశారు. యూఎస్ వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను (Temporary Status for Immigrants) రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది.
* అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు ఇటీవల సురక్షితంగా భూమిని చేరుకున్న సంగతి తెలిసిందే. 8 రోజుల పర్యటన నిమిత్తం ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వీరు అనుకోనివిధంగా సుమారు 9 నెలల పాటు అక్కడే గడపాల్సి వచ్చింది. అయితే, సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు వీరికి ఎలాంటి అదనపు వేతనాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. వారి ఓవర్‌టైమ్ జీతాన్ని తాను సొంతంగా చెల్లిస్తానని ప్రకటించారు.
* ఐపీఎల్ 2025 (IPL 2025) ఆరంభ వేడుకలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా వేదికపై బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేశారు. వారిద్దరి డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా, ఆర్సీబీ తలపడుతున్న విషయం తెలిసిందే.
* ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇప్పటివరకు నెలలో మూడో శనివారం మాత్రమే ఉన్న ‘నో బ్యాగ్ డే’ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామన్నారు. ఆ రోజు విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు.
* ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. కేంద్ర పథకాలు, దిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలన్నారు.
* త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్ దిల్లీ బడ్జెట్ (Delhi budget) విషయంలో ప్రజల నుంచి 10 వేల సూచనలు అందినట్లు ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rekha Gupta) వెల్లడించారు. ఇందులో మహిళల ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యం వంటివాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దేశరాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
* ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా వేదికగా ఈ రోజు జరగనుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలపడనున్నాయి. ఆర్సీబీ జట్టు నూతన కెప్టెన్‌గా రజత్ పటీదార్ (Rajat Patidar) నియమితుడయ్యాడు. ఇంతకుముందు డుప్లెసిస్ (Faf du Plessis) సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్‌లో పటీదార్ భుజస్కంధాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. గత 17 సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఈ సారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాణించకపోతే రజత్ పటీదార్ కెప్టెన్సీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ నూతన కెప్టెన్ పటీదార్‌కు, అలాగే ఆర్సీబీ ఫ్రాంచైజీకి చాలా కీలకం అని అన్నాడు.
* ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా (Vinod Kumar Shukla) జ్ఞానపీఠ్ (59th Jnanpith Award) పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం.
* సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ భూమిపూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బలమైన, అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు.
* రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ భారాసదే అని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. గోదావరిఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో సమావేశమైన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
* సొంత పార్టీ నేతలపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త భాజపా అధ్యక్షుడు వస్తున్నారని చెప్పారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా, జాతీయ నాయకత్వమా అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌గానే ఉంటారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z