* బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ వెల్లడించింది. తమ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి ప్రచారానికి ఆయన తోడ్పడనున్నట్లు తెలిపింది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా కొత్త టాటా కర్వ్ ప్రచార కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని వివరించింది. ఇందుకోసం 20 సెకన్ల నిడివితో ‘టేక్ ది కర్వ్’ పేరిట ప్రకటనలు రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా మోటర్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కౌశల్ కంపెనీ తాజా కారు కర్వ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్ట్ లో “ఉత్తమ కథలు ట్విస్ట్ లతో నిండి ఉంటాయి.. విక్కీ కౌశల్‌తో టాటా మోటార్స్ కొత్త శకానికి స్వాగతం” అంటూ రాసుకొచ్చింది.
* మన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్‌లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్‌ఖాన్‌పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్‌గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్‌జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది.
ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీ
ఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు
లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు
నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు
నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు
స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు
ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు
ఎంటర్‌టైన్‌మెంట్: 470 ఎకరాలు
హెల్త్ సిటీ: 370 ఎకరాలు
ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు
ఏఐ సిటీ: 297 ఎకరాలు
* భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.
* ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటోన్న అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ లేఆఫ్‌లను అమలు చేస్తోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ఇంజినీరింగ్ టెక్నాలజీ సెంటర్ నుంచి 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విమాన తయారీ సంస్థ భారత్ లో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. బోయింగ్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. భారత్‌లో ఇటీవల 2024 డిసెంబర్ త్రైమాసికంలో జరిగిన తొలగింపులు ఇందులో భాగంగానే జరిగాయి. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అయితే వీటి ప్రభావం కస్టమర్లు, కార్యకలాపాలపై పెద్దగా ఉండదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
* తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆలోచనే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల (Futures and Options (F&O) విభాగంలో ట్రేడింగ్ చేస్తున్న రిటైల్ మదుపర్లపై చాలా కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) స్పందించారు. అతివిశ్వాసమే సంపద కోల్పోయేందుకు కారణమవుతోందన్నారు. బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 ఫోరమ్‌లో పాల్గొన్న పాండే.. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సెబీ అధ్యయనాల ప్రకారం.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది రిటైల్ పెట్టుబడిదారులు డబ్బును కోల్పోతున్నారన్నారు. తమ ట్రేడింగ్ సామర్థ్యాలను తరచూ అతిగా అంచనా వేసుకొనే మదుపర్లే ఇలా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గడువు ముగిసే (expiry days) కొన్ని నిమిషాల ముందు మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల అస్థిరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z