* చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇటీవల విడుదలైన చైనీస్ ఏఐ టూల్ ‘డీప్‌సీక్’ను యుద్ధేతర కార్యకలాపాలకు వాడుతున్నట్లు నిర్ధారించింది. ముఖ్యంగా సైనిక ఆసుపత్రుల్లో చికిత్స ప్రణాళికలను రూపొందించడంలో వైద్యులకు సహాయపడటానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. పీఎల్ఏ ఆస్పత్రులు, పీపుల్స్ ఆర్మ్‌డ్ పోలీస్ (పీఏపీ), నేషనల్ డిఫెన్స్ మొబిలైజేషన్ ఆర్గనైజేషన్లలో డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను వినియోగిస్తున్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో జనరల్ ఆసుపత్రి పీఎల్ఏ సెంట్రల్ థియేటర్ కమాండ్ డీప్‌సీక్‌కు చెందిన ఆర్ 1-70బీ ఎల్ఎల్ఎం వాడకానికి అనుమతిచ్చినట్లు ప్రకటించింది. ఇది వైద్యులకు మద్దతుగా నిలుస్తూ చికిత్స ప్రణాళిక సూచనలను అందిస్తుందని తెలిపింది. ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు గోప్యంగా ఉంచడానికి, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. ఈ మొత్తం డేటాను స్థానిక సర్వర్లలో నిల్వ చేయనున్నట్లు చెప్పింది. ‘301 ఆసుపత్రి’ అని పిలువబడే బీజింగ్‌లోని ఎలైట్ పీఎల్‌ఏ జనరల్ ఆసుపత్రితో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పీఎల్ఏ హాస్పటల్‌ల్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడ చైనా సీనియర్ సైనిక అధికారులు చికిత్స పొందుతారు.
* ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టీ (L&T) బాటలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా (Acer India) మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. నెలసరి సమయంలో ఒక రోజు పెయిడ్ లీవ్ (Menstrual Leave)ను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇది మహిళల సాధారణ సెలవులపై ఎలాంటి ప్రభావం లేకుండా నెలసరి సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. మాతృక పేరిట ఈ లీవ్‌ను అందించనుంది. ‘‘ మాతృక నెలసరి విధానంతో.. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టిసారించాం’’ అని ఏసర్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ అన్నారు.
* స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్లు పుంజుకొని 77,311 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు ఎగబాకి 23,472 దగ్గర కొనసాగుతోంది. ప్రారంభంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో కనిపించింది. నిఫ్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, కొటక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. స్టాక్ మార్కెట్లో స్వల్పకాలానికి సెంటిమెంటు బాగుండడంతో ఈ వారం సూచీలు రాణిస్తున్నాయి. షేర్ల విలువలు సహేతుక ధర వద్ద ఉండడం, రూపాయి బలోపేతం అవుతుండడంతో రాబోయే రోజుల్లో కొనుగోళ్లు కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అమెరికా టారిఫ్ సంబంధిత ప్రతికూల వార్తలేవైనా కనిపిస్తే మాత్రం లాభాల స్వీకరణకు అవకాశం ఉందని కొంత అంచనా వేస్తున్నారు. భారత్‌పై అమెరికా టారిఫ్‌లకు సంబంధించిన పరిణామాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 12 పైసలు పెరిగి, 85.86 వద్ద ప్రారంభమైంది.
* ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon).. తమ వేదికపై ఉత్పత్తులు విక్రయించే చిన్న విక్రేతలకు గుడ్‌న్యూస్ చెప్పింది. 135 కేటగిరీలకు చెందిన రూ.300 కంటే తక్కువ విలువ కలిగిన 1.2 కోట్ల ఉత్పత్తులకు సెల్లర్ ఫీజును (రిఫరల్ ఫీజు) రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటివరకు తమ వేదికను ఉపయోగించుకొని ఉత్పత్తులు విక్రయించినందుకు గానూ సెల్లర్ల నుంచి అమెజాన్ కమీషన్ తీసుకుంటుంది. ఈ మొత్తం కేటగిరీని బట్టి 2 శాతం నుంచి 16 శాతం వరకు ఉంటుంది. అమ్మకం ధర ఆధారంగా ఈ ఫీజును నిర్ణయిస్తుంటుంది.
* రిలయన్స్ జ్యువెల్స్ తన వినియోగదారులకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారం, వజ్రాభరణాల కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రిలయన్స్ జ్యువెల్స్ మార్చి 31 వరకు ప్రత్యేక పండుగ సేల్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా కొనుగోలుదారులు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50% వరకు, వజ్రాభరణాల విలువ, వాటి తయారీ ఛార్జీలపై 35% వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. నిర్దేశించిన తేదీలోపు దేశంలోని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
* 2024లోనే 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరగడం గమనార్హం. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో 5జీ నెట్‌వర్క్ ప్రస్తుతం 43% వాటాను కలిగి ఉంది. 2023 నుంచి ఈ వాటా దాదాపు రెట్టింపు అయింది. 2024లో ప్రతి వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వినియోగం 27.5 జీబీకి చేరుకుంది. గత ఐదేళ్లలో 19.5% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) చొప్పున ఈ వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు పెరగడం, మెరుగైన ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ కంటెంట్ వ్యాప్తి ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
* ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ నుంచి తమ ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. వంటి కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి కార్ల ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి. ముడి సరుకు వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సతమతమవుతున్నందున తయారీ సంస్థలు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన మొత్తం శ్రేణి వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి 4% ధరల పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. మార్కెట్లో కంపెనీ పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే వ్యయ పెరుగుదలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ధరల పెంపు నిర్ణయంతో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో సహా పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z