Devotional

24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు-NewsRoundup-Mar 24 2025

24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు-NewsRoundup-Mar 24 2025

* దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (Delhi HC Judge) జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ దిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

* రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్‌యూ)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

* పార్లమెంటు(Parliament) సభ్యులకు ప్రతి నెలా అందే వేతనాలు, పెన్షన్లును కేంద్రం పెంచింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24శాతం మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ.లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెరగనుంది. అలాగే, సిట్టింగ్‌ సభ్యుల రోజువారీ భత్యాన్ని రూ.2వేల నుంచి 2,500కు పెంచుతున్నట్లు పేర్కొంది. మాజీ పార్లమెంటు సభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పెంచిన ఈ వేతనాలను 2023 ఏప్రిల్‌ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

* రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS)కి ఆశించిన స్పందన ఉందని.. అయితే గడువు పొడిగించాలనే ఆలోచన ఇప్పటివరకూ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ తగిన పరిశీలన అనంతరం ప్రొసీడింగ్స్‌ ఇస్తామన్నారు. గతంలో 10 శాతం రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలో.. మిగిలిన 90 శాతం ప్లాట్స్‌కు కూడా ఇప్పుడు ఎల్‌ఆర్ఎస్‌ చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలో పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతో తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలు తగ్గించాలన్నారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

* తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్‌ జరిపించాలని గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థులు హైకోర్టు (TG High court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. అలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు.

* ఈ ఏడాది మార్చి 21 నుంచి 23 వరకు వడగళ్ల వానలతో పంట నష్టం సంభవించింది. పంట నష్టంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. దీనికి సంబంధించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశించారు. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేశామని ఆయన తెలిపారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందన్నారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి నివేదిక వచ్చాక పరిహారం చెల్లింపునకు చర్యలు చేపడతామన్నారు.

* ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు.

* ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు.

* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్‌ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. బోర్డు తీర్మానాలను వివరించారు.

బోర్డు చేసిన తీర్మానాలు ఇవీ..
ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్
తితిదే ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీ ఏర్పాటు
తితిదేకు చెందిన భూముల న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు
తితిదేలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం.
వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక చర్యలు
గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం
శ్రీనివాస సేవా సమితి పేరుతో స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
తితిదే మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం
తిరుమలలో అనధికార హాకర్లు తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ
వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయింపు. ప్రయోగాత్మకంగా పూర్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం
రూ.5,258.68 కోట్లతో తితిదే 2025-26 బడ్జెట్‌కు ఆమోదం
రూ.772 కోట్లతో గదుల ఆధునికీకరణకు నిర్ణయం

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z