అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z