Politics

అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి అరకు ఎంపీనే పిలవలేదు-NewsRoundup-Mar 25 2025

అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి అరకు ఎంపీనే పిలవలేదు-NewsRoundup-Mar 25 2025

* ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పాత బకాయిలపై వడ్డీని 50శాతం మేర మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

* ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)ఒక వికెట్ తేడాతో గెలిచింది. 210 పరుగుల లక్ష్యఛేదనలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై గెలుపు ఆశలను వదులుకున్న దిల్లీని ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (Ashutosh Sharma) (66; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అశుతోష్ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చేతి వేలు కట్ అయినా మ్యాచ్‌ ఆడాడని పేర్కొన్నాడు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొల్లినగర్ మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్‌కు రంధ్రం పడటంతో భారీగా నీరు వృథాగా ప్రవహించింది. విద్యుత్ నియంత్రిక వద్ద ఎర్త్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ఈ పనులతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్‌కు రంధ్రం పడింది. నీరు భారీగా రావడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసర వస్తువులు, ఇతర సామగ్రి తడిచిపోయాయని స్థానికులు తెలిపారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. ‘‘వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అందులో భాగంగానే సీబీఐ అధికారి రామ్‌సింగ్‌, సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు’’ అని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

* భారత సైన్యానికి (Indian Army) చెందిన ఓ మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ (RPA)ను చైనా హ్యాక్ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది. దీనిపై తాజాగా ఆర్మీ స్పందించింది. ఆ పోస్టులో సమాచారాన్ని ఖండించింది. నిర్ధరించుకోని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని పోస్ట్‌ చేయడం మానుకోవాలని హెచ్చరించింది.

* సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఇతర తెలుగుదేశం నేతలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి.. లోకేశ్‌ను కలవడంపై సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఐటీ సంస్థ సిస్కో, స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ మధ్య ఇవాళ ఉదయం ఎంవోయూ జరిగింది. ఈ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్‌ మేనేజర్‌ హోదాలో ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు.

* దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ (Gold smuggling case) అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో ఆమె బంగారం కొనుగోలు చేసేందుకు హవాలా డబ్బును వినియోగించినట్లు విచారణలో తేలింది. స్వయంగా రన్యారావు దీన్ని అంగీకరించినట్లు డీఆర్‌ఐ (DRI) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

* పర్యటకులతోపాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు (Britain) వెళ్లే విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్‌, విజిటర్‌ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త ఛార్జీలు (UK visa fees) 2025 ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. భారతీయులు బ్రిటన్‌లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. ప్రస్తుతం ఈ వీసా (ఆరు నెలల గడువు) ఫీజు 115 పౌండ్లు ఉండగా.. పది శాతం పెరిగి 127 పౌండ్లకు చేరుకుంది. అదే రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెరిగింది. విద్యార్థి వీసాలపైనా ఈ పెరుగుదల ప్రభావం కనిపించనుంది. ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. త్వరలో అది 524 పౌండ్లకు చేరనుంది. చైల్డ్‌ స్టూడెంట్‌లకూ ఇదే పెంపు వర్తిస్తుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లిష్‌ కోర్సు చదివే విద్యార్థుల ఫీజు కూడా 14 పౌండ్లు పెరగనుంది.

* పార్లమెంట్ లో నిన్న(సోమవారం) అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం జరిగితే , దానికి తనను పిలవకపోవడం అవమానమే కాకుండా, ఇది తనను గెలిపించిన ప్రజలకు జరిగిన అన్యాయమన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజా రాణి. ‘పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభిస్తే దానికి నన్ను పిలవలేదు. అరకు ఎంపీగా ఉన్న నన్ను అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి పిలవకపోవడం చాలా అవమానం.. మా నియోజకవర్గం ప్రజలకి జరిగిన అన్యాయం కూడా. పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం గర్వించదగ్గ విషయం. అరకు గురించి పార్లమెంట్ లో గళం వినిపిస్తున్నా. అరకు స్టాల్ పెడితే అరకు ఎంపీని పిలవరా?, అరకులోని కాఫీ అందరూ రుచి చూస్తున్నారు. ఎంతో కష్ట పడి పండిస్తున్నారు. అరకు కాఫీ ఒక్కటే కాదు.. చాలా రకాలు ఉన్నాయి. వాటి అన్నింటిని ఎంపీలకు తెలిపే అవకాశం ఉండేది. అరకు దింసా నృత్యం చాలా ఫేమస్ అరకు ఎంపీనే పట్టించుకోని నేతలు ఉన్నారు. వాళ్లు ప్రజలను ఎలా చూస్తారో అర్ధం అవుతుంది పార్లమెంట్ సాక్షిగా ఇలాంటి అన్యాయం జరిగింది. పార్టీలను పక్కన పెట్టి ఎంపీగా ఆహ్వానం ఇవ్వాలి. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం’ అని ఎంపీ తనూజారాణి స్పష్టం చేశారు.

* ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి’’ అని చంద్రబాబు అన్నారు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z