ఎన్నికల వ్యూహకర్త నుంచి పూర్తికాల రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ మారబోతున్నారు. బీబీసీ ప్రతినిధి సరోజ్ సింగ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.తన భావజాలంతో పాటు తనను ప్రభావితం చేసిన ప్రస్తుత నాయకుల గురించి ఆయన స్పందించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
ప్రశ్న: ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీజేపీకా లేదా కాంగ్రెస్‌కా లేదా టీఆర్‌ఎస్‌కా? లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టికి మద్దతు తెలుపుతారా? మీ భావజాలమేంటి
ప్రశాంత్ కిశోర్: నా వ్యక్తిగత సిద్ధాంతాలు, ఐడియాలజీ విషయానికి వస్తే మధ్యేవాదానికి వామపక్షంగా(లెఫ్ట్ ఆఫ్ సెంటర్) ఉంటాయి. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అలానే ప్రతి వ్యక్తికీ ఐడియాలజీ ఉండాలి. అదే సమయంలో మన ఐడియాలజీ వల్ల మన ధ్యేయం (ఆబ్జెక్టివిటీ) దెబ్బతినకూడదు. ఐడియాలజీతో మీ ధ్యేయాలు, నిర్ణయాలు విషపూరితం కాకుండా చూసుకోవాలి. మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనలు ఐడియాలజీ పేరుతోనే జరిగాయి. అందుకే ఐడియాలజీ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న: మీరు నా ప్రశ్నకు పూర్తిగా సమాధానం ఇవ్వలేదు. మీరు చెప్పేది సామాన్య ప్రజలకు పూర్తిగా అర్థంకాకపోవచ్చు. మీరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
ప్రశాంత్ కిశోర్: నేను ఏడాది కిందటే ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం ఆపేశాను. నాకు అవకాశం వచ్చిన, నేను చేయాలని అనుకున్న పార్టీలతో నేను కలిసి పనిచేశాను. అయితే, వాటి ఆధారంగా నా ఐడియాలజీని నిర్ణయించకూడదు.
ప్రశ్న: మీరు గతంలో జేడీయూతో కలిసి పనిచేశారు. అంటే అప్పుడు మీ ఐడియాలజీ, జేడీయూకు దగ్గరా ఉందని అనుకోవచ్చా?
ప్రశాంత్ కిశోర్: నిజమే. అప్పుడు జేడీయూకు నా ఐడియాలజీకి సారూప్యతలు ఉండేవి. కానీ, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)ల విషయంలో ఆ పార్టీతో నాకు విభేదాలు వచ్చాయి. దీంతో నేను పార్టీ వీడాను.
ప్రశ్న: మీరు జేడీయూను వదిలేశారా? లేకపోతే వారే తొలగించారా
ప్రశాంత్ కిశోర్: వారే తీసేశారు. సీఏ, ఎన్ఆర్‌సీల విషయంలో పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తంచేశాను. ఇవి పార్లమెంటులో జేడీయూ వ్యక్తంచేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి. దీంతో పార్టీ నాయకత్వానికి, నాకు విభేదాలు వచ్చాయి. పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి నన్ను పార్టీ నుంచి తొలగించారు.
ప్రశ్న: కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎవరు ఉంటే బాగుంటుందనుకుంటున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ?
ప్రశాంత్ కిశోర్: సోనియా గాంధీ
ప్రశ్న: ప్రశాంత్ కిశోర్ కెరియర్‌లో హైపాయింట్ ఏది? 2014లో బీజేపీకి విజయం తెచ్చిపెట్టడం లేదంటే 2021లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని గెలిపించడమా
ప్రశాంత్ కిశోర్: ఈ రెండూ కాదు. పంజాబ్‌లో ఇంతకుముందు ఆప్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం.
ప్రశ్న: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇతరులు?
ప్రశాంత్ కిశోర్: తెలియదు.
ప్రశ్న: అంటే జీజేపీ గెలుస్తుందని అంశాన్ని మీరు తిరస్కరించడం లేదు.
ప్రశాంత్ కిశోర్: లేదు.. నాకు తెలియదని చెబుతున్నాను.
ప్రశ్న: 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఎలా పనిచేస్తారు? వ్యూహకర్తగా లేదా రాజకీయ నాయకుడిగా లేదా కొత్త పార్టీ అధ్యక్షుడిగా?
ప్రశాంత్ కిశోర్: రాజకీయ నాయకుడిగానే ఉంటాను. కానీ, ఎక్కడుంటానో, ఏం చేస్తానో తెలియదు.
ప్రశ్న: బీజేపీలో భవిష్యత్ తరం నేత ఎవరు? యోగి ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ, హిమంత్ బిశ్వ శర్మ, అనురాగ్ ఠాకుర్?
ప్రశాంత్ కిశోర్: నాకు తెలియదు
ప్రశ్న: విపక్ష నాయకుల్లో శక్తిమంతమైనవారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, సచిన్ పైలట్, ఆదిత్యా ఠాక్రే?
ప్రశాంత్ కిశోర్: నాకు తెలియదు
ప్రశ్న: మీపై అధికంగా ప్రభావం చూపిన నాయకులు ఎవరు? నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నీతీశ్ కుమార్?
ప్రశాంత్ కిశోర్: నీతీశ్ ప్రభావం నాపై ఉండేది. నేను ప్రభావానికి గురికాకుంటే పార్టీలో చేరకుండా ఉండేవాణ్ని. నేను ఒక పార్టీలోనే చేరాను. అది జేడీయూ. ఆ పార్టీ నాయకుడు నీతీశ్ కుమార్. దీని ప్రకారం నాపై నీతీశ్ ప్రభావం ఉండేది అని అర్థం చేసుకోవచ్చు.
ప్రశ్న: అంటే రాహుల్ గాంధీ ప్రభావం ఉండటం వల్లే మీరు కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్నారా?
ప్రశాంత్ కిశోర్: మీరు ర్యాపిడ్ ఫైర్ అన్నారు? పూర్తి ప్రశ్నలు అడుగుతున్నారు.
ప్రశ్న: ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ఏం చేయాలని అనుకుంటున్నారు? కాంగ్రెస్ తలుపులు మూసుకుపోయినట్లేనా?
ప్రశాంత్ కిశోర్: 2021లో బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏడాది విరామం తీసుకొని ఏం చేయాలో ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రెండు, మూడు రోజుల్లో ప్రజలకు నా నిర్ణయాన్ని తెలియజేస్తాను.
ప్రశ్న: కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా?
ప్రశాంత్ కిశోర్: రెండు, మూడు రోజుల్లో చెబుతాను.