NRI-NRT

అమెరికా ఇంటెలిజెన్స్‌లో భార‌తీయుడికి చోటు

అమెరికా ఇంటెలిజెన్స్‌లో భార‌తీయుడికి చోటు

సీఐఏ.. సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. అగ్ర‌రాజ్యం అమెరికా నిఘా సంస్థ‌. ఇందులో భార‌త సంత‌తికి చెందిన చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. ఢిల్లీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన నంద్ ముల్‌చందానీ 25 ఏండ్లు సిలికాన్ వ్యాలీలోనూ, అమెరికా ర‌క్ష‌ణ శాఖ‌లో సేవ‌లందించారు. ఆయ‌న‌ను సీఐఏ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌గా నియ‌మిస్తూ ఆ సంస్థ డైరెక్ట‌ర్ విలియం జే బ‌ర్న్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు బ‌ర్న్స్ త‌న బ్లాగ్ పోస్ట్‌లో రాసుకున్నారు. ఈ అంశాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. సీఐఏ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌గా భార‌త సంత‌తి పౌరుడు నియ‌మితులు కావ‌డం ఇదే తొలిసారి.

సీఐఏ సీటీవోగా నంద్ ముల్‌చందానీ నియామ‌కాన్ని బ‌ర్న్స్ ధృవీక‌రించారు. సంస్థ‌ను టెక్నాల‌జీ ప‌రంగా బ‌లోపేతం చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు తెలిపారు. అందుకు న్యూ సీటీవో చాలా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. త‌న టీంలో నంద్ ముల్‌చందానీ భాగ‌స్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని, నూత‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో ఆయ‌న‌కు గ‌ల అపార అనుభ‌వం ఉప‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు.

నంద్ ముల్‌చందానీ ప‌లు స్టార్ట‌ప్ సంస్థ‌ల స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడిగా, సీఈవోగా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్ డిగ్రీ, స్టాన్‌ఫ‌ర్డ్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌, కార్నెల్‌లో కంప్యూట‌ర్ సైన్స్ డిగ్రీ ప‌ట్టా అందుకున్నారు. 1979-87 మ‌ధ్య ఢిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంట‌ర్నేష‌న‌ల్‌లో విద్యాభ్యాసం చేశారు.