ఊహించని విజయాన్ని దక్కించుకున్న వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి పార్టీపై పూర్తి పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నారు. పార్టీలో తనతో సమాన స్థాయిలో ఎవరూ ఉండకూడదనే ఆలోచనా భావనతో జగన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్లను సైతం జగన్ వ్యూహత్మకంగా పక్కన పెట్టేశారు. దీంతో పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలు జగన్ వైఖరికి నిరసనగా రగిలిపోతున్నారు. వైకాపాలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొంది మంచి నేతగా పైకి వచ్చిన ఆర్కే రోజా గత కొద్దిరోజుల నుండి ఎక్కడా కనిపించడం లేదు. రోజా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా అవమానాలు భరించారు. అసెంబ్లీ నుండి అసాధారణ రీతిలో బహిష్కరణకు గురయ్యారు. 2014 ఎన్నికల అనంతరం ఆవసాన దశలో ఉన్న వైకాపాకు మంచి ఆదరణ కల్పించడంలో, గట్టి ప్రతిపక్షంగా వ్యవహరించడంలో రోజా పోషించిన పాత్ర ప్రజలందరికీ తెలుసు. పార్టీలో బలపడుతున్న రోజాను పైకి రాకుండా అణగదోక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. మరొక పక్క చిత్తూరు జిల్లాకే చెందిన మరొక ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైకాపా పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాటం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చెవిరెడ్డిపై చాలా కేసులు నమోదయాయి. లాఠీ దెబ్బలు కూడా చెవిరెడ్డి రుచి చూశారు. అటువంటి భాస్కరరెడ్డికి మంత్రి పదవి రాకపోవడం పట్ల ఆ పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జగన్ కన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెవిరెడ్డి, రోజాలు తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు. వారిద్దరిని జగన్ పక్కన పెట్టడం ఆ పార్టీ వర్గాల్లో మింగుడు పడటం లేదు. చెవిరెడ్డికి ఇస్తామంటున్న ఉడా ఛైర్మన్ పదవి ఎందుకూ పనికిరానిదని ఆయన స్థాయికి తగినది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని కూడా జగన్ పక్కన పెట్టేశారు.
* నెల్లూరు జిల్లాలో రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్థన్రెడ్డి వంటి సీనియర్లను కూడా జగన్ పక్కన పెట్టేశారు. అనంతరం అనంతపురంలో సీనియర్ పార్లమెంటు సభ్యుడిగా పేరుపొందిన అనంత వెంకటరామిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు.
* కర్నూలులో తెదేపాను వీడి వైకాపాలో చేరిన శిల్పా కుటుంబానికి నిరాశ తప్పలేదు.
* ప్రకాశం జిల్లాలో వైకాపా సీనియర్ నేత, వైద్య ప్రముఖుడు కన్నా రాంబాబుకు మాజీ మంత్రి మహీదరరెడ్డిలకు మొండి చెయ్యే ఎదురైంది.
* గుంటూరు జిల్లాలో వైకాపా సీనియర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వైకాపా అధికార ప్రతినిధిగా తెదేపా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే స్పీకర్ కోడెలను ఓడించిన అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కకపోవటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్నిటికంటే విచిత్రం మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగ ప్రకటన చేశారు. అదే విధంగా చిలకలూరిపేటలో విడదల రజనీని గెలిపిస్తే మర్రి రాజేశ్‌కు మంత్రి పదవి ఇస్తానని స్వయంగా ప్రకటించిన జగన్ మాట నిలుపుకోలేకపోయారు. పల్నాడులో వైకాపాకు విజయం చేకూర్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.
* కృష్ణాజిల్లాలో సామినేని ఉదయభాను, మాజీమంత్రి పార్థసారధి వంటి సీనియర్లను పక్కన పడేశారు.
* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడిస్తే గ్రంథి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. ఆయనతో పాటు మరో సీనియర్ నేత నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు స్థానం దక్కలేదు.
* విశాఖ పట్టణంలో అనకాపల్లి నుండి గెలిచిన పార్టీ సీనియర్ నేత గుడివాడ అమరనాథ్‌కు చోటు దక్కలేదు.
* విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితిని ఓడించిన వైశ్య ప్రముఖులు పార్టీ సీనియర్ నేత కొలకట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కలేదు.
* శ్రీకాకుళంలో అనూహ్యంగా ధర్మాన ప్రసాదరావును పక్కకు నెట్టివేయడం అందరికి పెద్ద ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రసాదరావు రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమారరెడ్డి మంత్రివర్గాల్లో సీనియర్ మంత్రిగా పనిచేశారు. వివిధ విషయాల్లో మంచి పట్టు ఉన్న ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వెనుక ఉన్న బలమైన కారణం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
*** జగన్ అంతర్యం ఏమిటి?
ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న 25 మంది వరకు 18 మంది మంత్రి పదవిలో నూతనంగా ఎంపికయిన వారే. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో రెండున్నర ఏళ్ల వరకే మంత్రులుగా ఉంచుతానని జగన్ ప్రకటించారు. ఎన్నికల ముందు రెండున్నర ఏళ్ల పాటు సీనియర్లను మంత్రులుగా నియమించుకోవచ్చునని వారి సహకారంతో జగన్ 2024 ఎన్నికలకు సిద్ధమవుతారని జగన్ అనుకూల వర్గం అంటోంది. అయితే ఈ రెండున్నరేళ్ళు పార్టీలో ఉన్న సీనియర్లు గోళ్ళు గిల్లుకుంటూ ఎలా కూర్చుంటారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న సీనియర్లను జగన్ ఎలా సంతృప్తి పరుస్తారో వేచి చూడవలసి ఉంది. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో సీనియర్లు ఎంతవరకు సహకరిస్తారో అనే విషయం కూడా వేచి చూడవలసి ఉంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.