తెలుగులో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం బాలీవుడ్‌లో ‘కబీర్‌సింగ్’గా పునర్నిర్మాణం జరుపుకొని..అక్కడ కూడా భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కియారా అద్వాణీ ఒక్కసారిగా తారాపథంలో దూసుకెళ్లింది. దక్షిణాది రీమేక్ సినిమా తన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చినప్పటికి భవిష్యత్తులో రీమేక్ కథాంశాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘భూల్ భులయ్యా-2’ త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా సౌత్ రీమేక్ చిత్రాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కియారా అద్వాణీ. ఆమె మాట్లాడుతూ ‘ఓటీటీ మాధ్యమాల వల్ల కథాంశాల ఎంపికలో చాలా మార్పులొచ్చాయి. సినిమాల తాలూకు లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా దక్షిణాది రీమేక్ చిత్రాల్ని ఎంపిక చేసుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఓటీటీ మాధ్యమాల్లో సినిమా అందుబాటులో ఉంటే రీమేక్‌కు ఎంచుకోకపోవడమే మంచిది. మాతృక కాన్సెప్ట్ ఆధారంగా కొత్త కథను సిద్ధం చేసుకొని రీమేక్ చేయడం వల్ల అనుకున్న ఫలితాలొస్తాయి’ అని చెప్పుకొచ్చింది. దక్షిణాది రీమేక్ చిత్రాల్లో నటించకూడదనే ఆలోచనతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని బాలీవుడ్ సర్కిల్స్‌లో అనుకుంటున్నారు.