Politics

మోదీ.. చిత్త‌శుద్ధి ఉంటే సుష్మా స్వ‌రాజ్ మాట నిల‌బెట్టు

మోదీ.. చిత్త‌శుద్ధి ఉంటే సుష్మా స్వ‌రాజ్ మాట నిల‌బెట్టు

బీజేపీ నాయ‌క‌త్వంపై రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప‌చ్చి అబ‌ద్ధాల‌తో పాల‌మూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పాల‌మూరు ప‌చ్చ‌బ‌డుతుంటే కొంత మంది కండ్లు ఎర్ర‌బ‌డుతున్నాయి.. చెరువులు నిండుతుంటే కొంత‌మంది గుండెలు మండుతున్నాయ‌ని కేటీఆర్ ఘాటుగా విమ‌ర్శించారు. మోదీకి చిత్త‌శుద్ధి ఉంటే సుష్మా స్వ‌రాజ్ ప్ర‌క‌టించిన మాదిరిగా పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా క‌ల్పించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు.కృష్ణా జ‌లాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్ర‌భుత్వం విఫ‌లం చెందింద‌ని కొంద‌రు ప‌నికిమాలిన మాట‌లు, ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారికంగా లెక్క‌లు చెప్తున్నా.. కృష్ణా న‌దిలో ఉమ్మ‌డి ఏపీలో 811 టీఎంసీలు మ‌న‌కు కేటాయింపులు ఉండే. రాష్ట్రం ఏర్ప‌డి ఎనిమిదేండ్లు అవుతోంది.. అప్ప‌ట్నుంచి కేంద్రాన్ని అడుగుతున్నాం.. కృష్ణా జ‌లాల్లో 811 టీఎంసీల హ‌క్కు ఇవ్వాల‌ని, పంప‌కాలు తేల్చాల‌ని అడిగాం. ప్రాజెక్టులు క‌ట్ట‌కుండా స‌తాయించిన జిల్లా పాల‌మూరు జిల్లాతో పాటు న‌ల్ల‌గొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండ‌ని 8 ఏండ్ల నుంచి కోరుతూనే ఉన్నాం. స్వ‌యంగా మోదీని కేసీఆర్ అడిగారు. అయినా ఉలుకుప‌లుకు లేదు. సెక్ష‌న్ 3 కింద బ్రిజేశ్‌ కుమార్ ట్రిబ్యున‌ల్‌కు రెఫ‌ర్ చేయాల‌ని అడిగాం. దున్న‌పోతు మీద వాన‌ప‌డ్డ‌ట్టు ఉంది. ఉలుకు ప‌లుకు లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.