DailyDose

చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం – TNI నేర వార్తలు

చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం  – TNI  నేర వార్తలు

*ఏపీలోని చిత్తూరు జిల్లాలో రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో రూ 11 కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకుని 12 మందిని అరెస్ట్ చేశారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ అనూహ్యంగా ఊపందుకోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఎక్క‌డికక్క‌డ దాడులు చేప‌డుతున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దసంఖ్య‌లో ఎర్ర‌చంద‌నం చెట్లు ఉండ‌టంతో అక్క‌డినుంచి త‌మిళ‌నాడుకు స్మ‌గ్లింగ్‌ను నిరోధించేందుకు జిల్లా న‌లువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.తాజా ఘ‌ట‌న‌లో పోలీసులు మంగ‌ళ‌వారం రూ 3 కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌లను సీజ్ చేసి ఏడుగురు స్మ‌గ్ల‌ర్‌ంను అరెస్ట్ చేశారు. నిందితుల‌ను త‌మిళ‌నాడుకు చెందిన‌ గోవింద్‌సామి సేథు (44), మురుగేశ‌న్ (50), పెరుమాళ్ వెంక‌టేష్ (44), క‌రియ రామన్ (27), క‌లంజ‌న్ (36), వెంక‌టేష ఆర్ (37), గోవింద రాజులు (21)గా గుర్తించారు.ఇక మ‌రో ఘ‌ట‌న‌లో తిరుప‌తి నుంచి చిత్తూరు వెళుతున్న మినీ గూడ్స్ వ్యాన్‌ను అడ్డ‌గించిన పోలీసులు రూ 4 కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను సీజ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దేవ‌న్ అలియాస్ నాగ‌రాజ్‌, వైద్య‌లింగం అలియాస్ సారంగ‌పాణి, న‌జీర్ భాషా, నానీ అలియాస్ ముత్తురామ‌న్‌ను అరెస్ట్ చేశారు. స్మ‌గ్లింగ్‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారిగా అనుమానిస్తున్న సెంథిల్ కుమార్ ప‌రారీలో ఉన్నాడు. సెంథిల్ కుమార్‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు.

*వైకాపా నాయకుడు మక్బూల్ బాషా బెదిరిస్తున్నాడంటూ అనంతపురం జిల్లా కణేకల్ పోలీస్ స్టేషన్లో హసీనా అనే మహిళ ఫిర్యాదు చేశారు. కణేకల్ మండలం ఆలూరులోని మదర్సాలో 4నెలలపాటు వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మక్బూల్ బాషా తనను తొలగించారని.. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళితే.. తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని వాపోయారు. మక్బూల్ బాషా తీరుతో భర్త, ఇతర కుటుంబసభ్యులు తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

* ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్గొంటూ అప్పులపాలైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం దామెర మండలంలోని ఊరుగొండలో చోటుచేసుకుంంది. ఊరుగొండ గ్రామానికి చెందిన సాంబారి నాగరాజు(23)ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పాల్గొని రూ.లక్షా 50వేల అప్పు చేశాడు. ఈ క్రమంలో తండ్రి రవీందర్‌ అప్పులను తీర్చాడు. అన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు మద్యానికి బానిసై అప్పటికే తన వద్ద ఉన్న పల్సర్‌ బైక్‌ను కుదువ పెట్టి అప్పులు చేశానని, వాటిని తీర్చాలని నాగరాజు తన తండ్రి రవీందర్‌ను కోరాడు. తన వద్ద డబ్బులు లేవని తండ్రి తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం తెల్లవారుజామున తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

*రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. రూ.60.18 లక్షల విలువైన 1,500 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మౌలాలిలోని ఓ ఖాళీ స్థలంలో ఎర్రచందనాన్ని నిందితులు డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు

* మీర్‌పేట్‌కు చెందిన వివాహిత శ్వేతారెడ్డికి బాగ్ అంబ‌ర్‌పేట్‌కు చెందిన య‌శ్మ కుమార్‌ను ప్ర‌శాంతి హిల్స్‌లో హ‌త్య చేయించిన దృశ్యాలు విడుద‌ల‌య్యాయి. య‌శ్మ కుమార్‌ను హ‌త్య చేసిన దృశ్యాలు అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. య‌శ్మ కుమార్‌ను ఈ నెల 5వ తేదీన రాత్రి 12:43 గంట‌ల‌కు హ‌త్య చేసిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. య‌శ్మ కుమార్ త‌న బైక్‌పై వ‌చ్చి ప్ర‌శాంతి హిల్స్‌లో ఆపాడు.అప్ప‌టికే అక్క‌డ మాటు వేసిన అశోక్ అనే యువ‌కుడు య‌శ్మ కుమార్‌తో మాట‌లు క‌లిపి.. త‌ల వెనుక భాగంలో సుత్తితో బ‌లంగా బాదాడు. దీంతో య‌శ్మ కిందప‌డిపోయాడు. మ‌రో రెండు, మూడు సార్లు త‌ల‌పై సుత్తితో మోదాడు. కాసేపు అక్క‌డే ఉన్న అశోక్.. ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు త‌మ కారును ఆపి పోలీసుల‌కు ఫోన్ చేస్తుండ‌గా అక్క‌డ్నుంచి త‌ప్పించుకున్నాడు. య‌శ్మ‌ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ రెండు రోజుల త‌ర్వాత మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజీ స‌హాయంతో పోలీసులు కేసు ఛేదించారు. ఈ కేసులో శ్వేతా రెడ్డితో పాటు అశోక్, కార్తీక్ అనే యువ‌కుల‌ను పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

* కరీంనగర్‌: జిల్లాలోని కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమిండటంతో శుక్రవారం ఉదయం ముగ్గురు మరణించారు. వేములవాడకు వెళ్తుండగా బావుపేట వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి
నిజామాబాద్‌: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా.. లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేవా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. శ్వేత మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

* ఎస్ఆర్ నగర్ పరిధిలో యూట్యూబ్ ప్రాంక్టర్ శ్రీకాంత్రెడ్డి పై దాడి జరిగింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై సినీ నటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కల్యాణి ఆరోపించింది. దీంతో ఇద్దరి మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మధురానగర్ లో రోడ్డుపై శ్రీకాంత్రెడ్డిని కరాటే కల్యాణి చితకబాదింది. తనపై కూడా శ్రీకాంత్రెడ్డి దాడి చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో ఇరువురు ఎస్ఆరనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

*కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడి నుంచి 12 ప్యాకెట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు యువకుడు నడుము చుట్టూ ఎలాస్టిక్ లోపల మత్తు పదార్థం దాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాన్ని సీజ్ చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

*కర్నూలు జిల్లాలోని సి.బెళగల్‌లో నక్క స్వైరవిహారం చేసింది. గత రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన నక్క…గ్రామస్తులపై విరుచుకుపడింది. శివారులో కుక్కలు, పశువులతో పాటు కనిపించిన వ్యక్తులపై దాడి చేసింది. ఈ క్రమంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామంలోని పలువురు యువకులు కర్రెలతో కొట్టి నక్కను చంపారు.

*నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేజీ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గైనకాలజీ వార్డులో డ్యూటీ చేస్తున్న స్టూడెంట్ శ్వేత… వాష్ రూమ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చెక్ చేశారు. ఈ క్రమంలో శ్వేత బెడ్‌పై మృతిచెందినట్లు విద్యార్థులు గుర్తించారు. శ్వేత కరీంనగర్ జిల్లా వాసి. ప్రస్తుతం గైనకాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిన్న రాత్రి రెండు గంటల వరకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శ్వేత డ్యూటీ చేసింది. మూడు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న రెస్ట్ రూమ్‌లోకి వెళ్లి పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి శ్వేత మృతిచెంది కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని నరసన్నపేట పట్టణంలో రాత్రి ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులు… ఎలుగుబంట్ల కోసం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో సంచరిస్తూ ఎలుగు బంటి సీసీ కెమెరాకు చిక్కింది. కుక్కలు అరవడంతో సమీపంలోని తోటల్లోకి ఎలుగుబంట్లు వెళ్లిపోయాయి. దీంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నాయి

*హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దోపిడీ జరిగింది. అంబర్ పేట ఖాద్రీబాగ్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న రమణమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి 3 తులాల పుస్తెల తాడును దుండగుడు లాక్కెళ్లాడు. దీంతో బాధితురాలు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తిస్తామని తెలిపారు.

*మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని, నిషేధిత తీవ్రవాద సంస్థ సీపీఐలోకి (మావోయిస్టు) యువకులను రిక్రూట్‌ చేస్తున్నారనే అభియోగాలపై అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన మాజీ మావోయిస్టు ఆంజనేయులు అలియాస్‌ అంజిని (36) గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది.గాలివీడుకు చెందిన ఆంజనేయులు మావోయిస్టు బాలేరు దళంలో పని చేస్తూ జనజీవన స్రవంతిలో కలిశారు. ఆరేళ్ల కిందట మదనపల్లెలోని బీకేపల్లె కాలనీలో స్థిరపడ్డారు. అయినా మావోయిస్టులతో సంబంధాలు కొసాగిస్తున్నారని గతంలో గుంటూరు పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. రెణ్నెల్ల కిందట ఎన్‌ఐఏ అరెస్టు చేసి తిరుచ్చికి తీసుకెళ్లి, 4 రోజుల తర్వాత విడిచిపెట్టింది. తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న అనుమానంతో ఎన్‌ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసి.. గురువారం వేకువజామున అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య సుగుణకు 41ఏ నోటీసులిచ్చి, అంజిని విచారణ నిమిత్తం తిరుచ్చికి తరలించారని సమాచారం.

*నంద్యాల: జిల్లాలోని నంద్యాలమండలం పోలూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లి లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు వేరేలా స్పందించారు. మిస్‌ ఫైర్‌ జరిగి ఎస్సై మృతిచెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్‌ ఫైర్‌ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.

*యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్‌ మద్యంమత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

*మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో (Car) బీభత్సం సృష్టించారు. తమ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టి గచ్చిబౌలి పోలీసులకు చిక్కారు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుడాకాలనీ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వట్టెం నిహాల్‌ (23), కొండాపూర్‌కు చెందిన లోహిత్‌(25)తో కలిసి మద్యం తాగారు. గురువారం సాయంత్రం 5.15 సమయంలో బీఎండబ్ల్యూ కారులో దూసుకువెళ్లారు. శ్రీరాంనగర్‌లోని మైహోం మంగళ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. వాహనంపై ఉన్న విజయ్‌కుమార్‌కు కుడిచేయి విరిగింది. మరో వ్యక్తి టి.సూర్యకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు వివరాలు సేకరిస్తుండగా నిహాల్‌, లోహిత్‌ వారితో వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహించగా నిహాల్‌కు 234/100, లోహిత్‌కు 501/100 వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

*ప్రముఖ నృత్య దర్శకురాలు, రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఆట’ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు సాధించిన టీనా సాధు గుండెపోటుతో మరణించారు. గోవాలో ఉన్న ఆమెకు.. బుధవారం గుండెపోటు రావడంతో మృతి చెందారని ఆమె స్నేహితుడు ‘ఆట’ సందీప్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే.. టీనా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరి మద్యం తాగడం వల్లే ఆమెకు గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. కొంతకాలంగా టీనా.. భర్తతో కలసి గోవాలోనే ఉంటున్నారనీ కొందరు అంటుండగా.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి స్నేహితులతో గోవా వెళ్లిందని మరికొందరు చెబుతున్నారు. దీంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ‘ఆట’ రియాలిటీ డ్యాన్స్‌ షో ద్వారా వెలుగులోకి వచ్చిన టీనా.. ‘ఆట’ సీజన్‌ 4కు జడ్జిగా వ్యవహరించారు. అలాగే, కొన్ని సినిమాలు, సీరియల్స్‌కు నృత్య దర్శకురాలిగా పని చేశారు.

*గర్భంతో ఉన్న 16 ఏళ్ల బాలికకు ఆమెకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్‌ చేశారా ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలి తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సిరిపంగ శ్రవణ్‌ (25) అనే యువకుడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమె గర్భం దాల్చింది. రెండ్రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలోని రామరక్ష అనే ప్రైవేటు ఆస్పత్రికి బాలికను తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి గర్భస్రావం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు, ఆస్పత్రి యాజమాన్యంపై మర్రిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో నాగజ్యోతి స్పందించారు. గురువారం సదరు ప్రైవేటు ఆస్పత్రిలో తనిఖీ చేసి రికార్డులను సీజ్‌ చేశారు.

*యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగి బస్సు టైరు కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో 20 రోజుల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అధికారుల వేధింపులతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని సహచర కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.

*ఐదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన బుధవారం రాత్రి పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులుపోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఓ కాలనీలో చిన్నారి కుటుంబం నివాసం ఉంటోంది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీకి చెందిన ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయబోయాడు. భయపడిన చిన్నారి పెద్దగా ఏడవడంతో పరారయ్యాడు. ఇంటికి వెళ్లిన తరువాత చిన్నారి విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకుఫిర్యాదు చేసింది. బాలుడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

*జమ్మూ-కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్‌గా గుర్తించారు.గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ వద్ద తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాహుల్ గాయపడ్డాడు. అతడ్ని స్థానిక ఆసుపత్రికి చేర్చి, చికిత్స అందించారు. అయితే, గాయాల కారణంగా రాహుల్ చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరు టెర్రరిస్టులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ దాడిలో తీవ్రవాదులు పిస్టల్ వాడినట్లు పోలీసులు చెప్పారు. కాగా, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం జమ్మూ-కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్‌లు జరిగిన మరుసటి రోజే తీవ్రవాదులు కాల్పులు జరపడం గమనార్హం.

*కడప నగరం వన్ టౌన్ పరిధిలోని మెహతాబ్ జ్యూవెలరీ షాప్ లో భారీ చోరీ కేసును, జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ నిరంతర పర్యవేక్షణలో, కడప DSP బి.వెంకట శివారెడ్డి గారి ఆద్వర్యం లో కడప వన్ టౌన్ పోలీసులు కేవలం 5 గంటల్లో చేధించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్న పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ మీడియా కు వివరాలు వెల్లడించారు. చోరీ కి పాల్పడ్డ షేక్ మసూద్ (39) అనే గుమస్తాను అరెస్టు చేసి రూ.1.2 కోట్ల విలువైన 2.66 కిలోల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు, మూడు మారు తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్.పి. శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు.

*ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి సుమారు రూ.2 కోట్ల మేర వసూలు చేసి, మోసం చేసిన వ్యవహారంలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై మరో అవినీతి కేసు నమోదైంది. పలు శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించిన మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై మాజీ స్పీకర్‌ కాళిముత్తు సోదరుడు, వెంబకోట యూనియన్‌ మాజీ అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి గత ఏడాది విరుదునగర్‌ జిల్లా క్రైం విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై రాజేంద్ర బాలాజి, ఆయన సహాయకుడు బాబురాజ్‌, బలరామన్‌, ముత్తుపాండి తదితరులపె నవంబరు 15న కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రాజేంద్ర బాలాజి పెట్టుఉన్న పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు డిసెంబరు 17న తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో, ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలించి జనవరి 5న కర్ణాటక రాష్ట్రంలో అరెస్ట్‌ చేశాయి. ఇదిలా ఉండగా మాజీ మంత్రి రాజేంద్ర బాలాజి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురి నుంచి సుమారు రూ.2 కోట్లు తీసుకున్నట్టు శివగంగకు చెందిన షణ్ముగనాథన్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి రాజేంద్ర బాలాజిని విచారించనున్నట్లు పోలీసుల సమాచారం.

*ప్రొద్దుటూరులో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురిని బుధవారం అదుపులోకి తీసుకొని గురువారం అరెస్టు చేశామని వైఎస్సార్‌ కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం వివరాలు వెల్లడించారు. ప్రొదు ్దటూరుకు చెందిన ఓ బాలిక గర్భం దాల్చి తిరుగుతుండడంతో మహిళా పోలీస్‌ ఈ నెల 4న ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ సీఐకి కాల్‌ చేసి చెప్పా రన్నారు. ఆ బాలికను స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రులను పిలుచుకు రావాలని చెప్పడంతో ఆ బాలిక తమ ఇల్లు దగ్గరే ఉందని చెప్పి వెళ్లిందన్నారు. తల్లి ఏడాది క్రితం మృతిచెందిందని, బాలిక తండ్రికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆ ప్రాంత అంగన్‌వాడీ టీచర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం సాయంత్రం 7 గంటలకు నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

*శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలుకమాకులపల్లిలో ఎర్రచందనం దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి పెనుకొండ మండలం గుట్టూరుకు చెందిన గ్రామ వలంటీరు మజ్జిగ రామాంజినేయులు కావడం గమనార్హం. నిందితుల నుంచి 40 ఎర్ర చందనం దుంగలు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని డీఎస్పీ రమ్య తెలిపారు.

* పీబీఆర్‌ పౌల్ట్రీ టెక్, అగ్రిటెక్‌ సంస్థలు బ్యాంకులను మోసం చేశాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విశాఖపట్నం ప్రత్యేక కోర్టులో కేసు నమోదుచేసింది. పోలేపల్లి వెంకటప్రసాద్‌ నేతృత్వంలోని ఈ సంస్థలు ప్లాంటు ఏర్పాటుచేసి, యంత్రాలు కొంటామని వీరభద్రాపురం ఓవర్‌సీస్‌ బ్యాంకులో రుణం తీసుకున్నాయి. అప్పుడు ఆ బ్యాంకుకు భూపతిరాజు కృష్ణమోహన్‌రాజు మేనేజర్‌ కాగా పీవీకే శ్రీనివాసరాజు ప్యానల్‌ వాల్యూవర్‌గా ఉన్నారు. అయితే తీసుకున్న రుణం దుర్వినియోగం చేశారు. అలాగే సోదర సంస్థ అయిన అగ్రిటెక్‌ పేరుతో వెంకట్రాయపురం ఆంధ్రాబ్యాంకులో కూడా రుణం తీసుకున్నారు. అక్కడ కూడా మోసం చేశారు. ఆ నిధులతో స్థిరాస్తులు కొనుక్కున్నారు. వీరి వల్ల రూ.17.27 కోట్లు రాని బకాయిలుగా ఉండిపోయాయని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి. దీనిపై ఈడీ దర్యాప్తు చేసి పోలేపల్లి ప్రసాద్‌కు చెందిన రూ.7.57 కోట్ల ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసింది.

*బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెంలో ఇంటర్‌ ఓపెన్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ఓఎ్‌సఎస్‌ పరీక్షల్లో.. గురువారం హిస్టరీ, మ్యాథ్స్‌ పరీక్ష జరుగుతున్న సమయంలో పాఠశాల సమీపంలో ఈపూరుపాలెంనకు చెందిన కోటేశ్వరరావు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతను మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రశ్నలకు జవాబులు తయారుచేసి లోపలికి అందజేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి వద్ద ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, కొన్ని జవాబుల స్లిప్‌లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*రంగారెడ్డిజిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటూప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ళ బాలిక (కుట్టి )మృతి చెందింది. నీటి సంపుకు ఉన్న మూత తెరిచి ఉండటంతో ప్రమాదం జరిగింది. బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతురాలు కొల్లాపూర్‌కు చెందిన సనజగదీష్ నాయక్‌ల కూతురు. ఆడుకుంటున్న తమ కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.