సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు జనాలు ఎగబడతారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ముంగిటకే వస్తే సమస్యలు విన్నవించుకుంటారు.కానీ ఏపీ సర్కారు చేపడుతున్న గడప గడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ప్రజల ఛీత్కారాలు, శాపనార్థాలు, తిట్ల దండకంతో జరుగుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యక్రమం అంటేనే భయపడిపోతున్నారు. తొలుత కార్యక్రమానికి ‘గడపగడపకూ వైసీపీ’ అని పేరు పెట్టారు. అలా అయితే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకునే వీలుండదు కాబట్టి దానిని గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం అని మార్చేశారు. నెల రోజుల నుంచి కార్యక్రమానికి వ్యూహరచన చేశారు. పల్లె పల్లెకు వెళ్లండి చేసేది చెప్పండి అంటూ సీఎం జగన్ ఆదేశించినా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో సగంమంది ‘గడప గడప’కు దూరంగానే ఉన్నారు. మంత్రులు కూడా చాలామంది ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. . ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రచారం చేసుకోవాలన్నది సీఎం ఉద్దేశం కాగా… ప్రజలు సమస్యలపై తమను నిలదీస్తారేమోననే భయం ఎమ్మెల్యేలది! ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించిన కొందరు ఎమ్మెల్యేల్ని ప్రజలు పలు సమస్యలపై నిలదీస్తున్నారు. విద్యుత్ బిల్లుల బాదుడు, చెత్తపన్ను నుంచి ఇంటిపన్ను వరకు పెంచేసిన వైనంపై కడిగేస్తున్నారు. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక… ఆ క్షణానికి ఏదో ఒకటి సర్దిచెప్పి ముందుకు వెళ్తున్నారు.
***కొన్ని జిల్లాల్లో అయితే..
చాలా జిల్లాల్లో అసలు ఎమ్మెల్యేలు ‘గడప గడప’కు ప్రారంభించనే లేదు. వర్షాలనీ, కరపత్రాలు రాలేదని కొందరు కుంటి సాకులు చూపుతూ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న వారు అసలు పాలుపంచుకోవడం లేదు. నెల్లూరు జిల్లా కావలి, నెల్లూరు సిటీ, కోవూరు, ఆత్మకూరుల్లో ఈ కార్యక్రమం అసలు ప్రారంభమే కాలేదు. గడపగడపకు వెళ్లలేనని, దానికి బదులు గ్రామసభలతో సరిపెడతానని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పార్టీ పెద్దలకే నేరుగా చెప్పేశారని సమాచారం. ‘గడప గడప’కు వెళ్లేందుకు తనకు ఆరోగ్యం సహకరించదని చెప్పినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంకా దీనిని ప్రారంభించలేదు. అనంతపురం జిల్లాలో… మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. కర్నూలు, తిరుపతి, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోనూ పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారా? తక్షణం ప్రారంభించాల్సిందే’ అంటూ ఎమ్మెల్యేలపై పైనుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. కానీ.. ప్రజలపై వేసిన భారాలు, కనిపించని అభివృద్ధిపై ఏం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఇష్టారాజ్యంగా పన్నుల భారం వేసేయడంతో ప్రజలు రగిలిపోతున్నారని, పైగా తాజాగా పెంచిన కరెంటు చార్జీలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని వాపోతున్నారు.
**బాదుడే బాదుడుకు దీటుగా..
పన్నుల భారం, ధరల భారం, ఎత్తేసిన పథకాలు, సంక్షేమంలో లొసుగులు! వీటన్నింటి ప్రభావంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిందనే విషయం వైసీపీ పెద్దలకూ తెలిసింది. అదే సమయంలో… తెలుగుదేశం పార్టీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం చేపట్టింది. ప్రజలపై పడిన భారాలు, సంక్షేమ పథకాల్లోని లోగుట్టు, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలను వివరించడం మొదలుపెట్టింది. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కరపత్రాలు కూడా పంచిపెడుతోంది. ఈ నేపథ్యంలో… తమ పరిస్థితి గ్రహించిన వైసీపీ పెద్దలు ‘గడప గడప’కు కార్యక్రమానికి తెరతీశారు. అనుకున్నదొకటి, అవుతున్నదొకటి అన్నట్లుగా… జనంలోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు భారీగా నిరసనల సెగ తగులుతోంది. ప్రజల్లో ఇప్పటికే బలంగా ఉన్న వ్యతిరేకతను తట్టుకుని ఈ కార్యక్రమాన్ని గట్టెక్కించడమెలా అనే ఆందోళనతో చాలామంది ఎమ్మెల్యేలు గడప దాటడంలేదు.