ScienceAndTech

అంతరిక్ష రక్షణ సంస్థ ప్రారంభించనున్న భారత్

India to begin space defense agency program

భారత సైనిక సామర్థ్యాలను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రం మరో కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది. అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదర్కొనేందుకు అధునాతన ఆయుధ వ్యవస్థను, సాంకేతికను ఈ ఏజెన్సీ మెరుగుపరచనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ త్వరలో డిఫెన్స్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అంతరిక్ష యుద్ధరంగంలో దీటుగా ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థను, సాంకేతికతను ఈ ఏజెన్సీ రూపొందిస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అత్యున్నత స్థాయి చర్చల అనంతరం కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలో సంయుక్త కార్యదర్శి స్థాయి శాస్త్రవేత్త సారథ్యంలో దీనికొక తుదిరూపు తీసుకురానున్నారు. ఈ ఏజెన్సీలో త్రివిధ దళాల అధికారులతో సహకారంతో కలిసి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తల బృందం ఉండనుంది. డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీతో కలిసి ప్రస్తుత ఏజెన్సీ పరిశోధనలు సాగించనుంది. ఈ ఏడాది మార్చ్‌లో ఉపగ్రహ విధ్వంస క్షిపణి పరీక్షను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఆ సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల సరసన భారత్‌ చేరింది. యుద్ధ సమయాల్లో భారత ఉపగ్రహాల జోలికి శత్రువులు రాకుండా రక్షించుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. త్వరలోనే బెంగళూరులో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ర్యాంక్‌ అధికారి పర్యవేక్షణలో డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీని నెలకొల్పనున్నారు.