Politics

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

Auto Draft

దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ వ్యాప్త పర్యటనలో బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం చండీగఢ్‌కు చేరుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిసిన కేసీఆర్‌ ఆపై చండీగఢ్‌కు వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా అక్కడికి బయల్దేరారు. చండీగఢ్‌లో వారిద్దరూ పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ను కలిశారు. దాంతో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కలిసినట్లయ్యింది.
ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ముందుగా గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు, రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గాల్వాన్‌ లోయలో అమరులైన వారిలో పంజాబ్‌ నుంచి నలుగురు సైనికులు ఉండగా, వారికి రూ. 10 లక్షల చొప్పన ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్‌. రైతులతో పాటు సైనిక కుటుంబాలకు చెక్కులను అందించారు.అనంతరం తెలంగాణ కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఎక్కడా లేని సమస్యలు మన దేశంలోనే ఉన్నాయి. ఇలాంటి సమావేశాలు పెట్టాల్సి రావడం బాధాకరం. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశం పరిస్థితి మారలేదు. దేశం ఇలా ఎందుకు ఉందో ఆలోచన చేయాలి. సాగు చట్టాలపై పోరాడిన రైతులకు పాదాభివందనం. గాల్వాన్‌లో చైనాతో జరిగిన పోరాటంలో పలువురు సైనికులు మరణించారు. పంజాబ్‌లో ఎన్నికల వలన సైనిక కుటుంబాలను కలవలేకపోయా’ అని పేర్కొన్నారు.