చెక్ బౌన్స్ కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు కోర్టులో చుక్కెదురైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 2017 నవంబరులో PSV గరుడవేగ చిత్రం వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి, సినీ నిర్మాత జీవిత రాజశేఖర్ ఇటీవల తిరువళ్లూరులోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హాజరయ్యారు. జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు కోటేశ్వరరాజు, అతని భార్య హేమ .. జీవిత రాజశేఖర్ దంపతులపై చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
జీవిత రాజశేఖర్ 2017లో తమ వద్ద ఆస్తులను తాకట్టు పెట్టి గరుడ వేగ చిత్ర నిర్మాణం కోసం రూ.26 కోట్లు అప్పుగా తీసుకున్నారని కోటేశ్వరరాజు వెల్లడించారు. అయితే, తమవద్ద తాకట్టు పెట్టిన ఆస్తులతో అప్పులు తీర్చకుండా.. అదే ప్రాపర్టీని మరొకరికి అమ్మారని కోటేశ్వరరాజు ఆరోపించారు. అంతేకాదు, జీవిత రాజశేఖర్ తమకు ఇచ్చిన చెక్కులు కూడా వివిధ బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయని వివరించారు. ఇక జీవిత రాజశేఖర్‌ల మీద మరో చెక్ బౌన్స్ కేసు నగరి కోర్టులో పెండింగ్‌లో ఉంది.2021 డిసెంబర్‌లో తిరువళ్లూరు కోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలయ్యిందని జ్యో స్టార్ ఎండీ హేమ వెల్లడించారు. ”ఇప్పటికే మూడు విచారణలు పూర్తయ్యాయి.. అప్పుగా తీసుకున్న డబ్బులో 25% మాకు వెంటనే చెల్లించాలని జీవితకు కోర్టు సూచించింది” అని హేమ ఇంతకముందు తెలిపారు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి రూ.13 కోట్ల చెక్‌బౌన్స్ కేసులో కోర్టు హాజరుకావాలని జీవితరాజశేఖర్ దంపతులను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలు వాయిదాల్లో కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే మే 30న కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు శేఖర్ సినిమా కూడా ఇలాంటి వివాదం వల్లే రిలీజైన కొన్ని గంటల్లోనే ప్రదర్శనను నిలిపివేశారు. దీనికి సంబంధించి కూడా కోర్టులో కేసు నడుస్తోంది.