NRI-NRT

బిల్‌గేట్స్, మస్క్‌ మాటల యుద్ధం

బిల్‌గేట్స్, మస్క్‌ మాటల యుద్ధం

ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య భేదాభిప్రాయాలు భగ్గుమంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ మధ్య మాటల పోరు ముదిరింది. టీ కప్పులో తుఫాన్‌లా మొదలైన వీరి కొట్లాట వ్యక్తిగత నిందారోపణల వరకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్న వీరి మధ్య గొడవ చివరకు ఆ ఫండింగ్‌పై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది…

ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్, మాజీ నంబర్‌వన్, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీని దెబ్బతీయడానికి గేట్స్‌ లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారన్న వార్తలు వీరి మధ్య విభేదాలకు నాంది పలికాయి. ట్విటర్‌ కొనుగోలు యత్నాల్లో ఉన్న మస్క్‌ను అడ్డుకునేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌ యత్నిస్తోందన్న ఒక వెబ్‌సైట్‌ కథనం మస్క్‌కు మరింత కోపం తెప్పించింది.

దీంతో గేట్స్‌పై, ఆయన ప్రోత్సహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై తీవ్ర విమర్శలకు దిగారు. గేట్స్‌ను అపహాస్యం చేసేలా కామిక్‌ ఫొటో కూడా ట్వీట్‌ చేయడంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందంటూ గేట్స్‌ కూడా పరోక్ష విమర్శలు చేశారు. గతంలో నూ వీరిద్దరూ చిన్న చిన్న విసుర్లు విసురుకున్నా తాజాగా మాటల యుద్ధం బాగా ముదిరింది.

విభేదాలు పెంచిన కథనం
ట్విటర్‌ను మస్క్‌ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ట్విటర్‌ అడ్వర్టైజర్లకు పలు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. వీటిలో 11 సంస్థలకు గేట్స్‌ ఫౌండేషన్‌ నిధులందించిందంటూ బ్రిట్‌బార్ట్‌ అనే వెబ్‌సైట్‌ తాజాగా కథనం వెలువరించింది. దీనిపై మస్క్‌ను కొందరు ట్విటర్‌లో ప్రశ్నించగా అదో ఒక పనికిమాలిన చర్య అంటూ తిట్టిపోశారు. అంతేగాక టెస్లాలో షార్ట్‌ పొజిషన్లు (షేర్‌ మార్కెట్లో ఒక కంపెనీ ధర పడిపోతుందనే అంచనాతో తీసుకునే పొజిషన్లు) అధికంగా తీసుకున్నారంటూ గేట్స్‌ను దుయ్యబట్టారు.

గేట్స్‌ను గర్భిణితో పోలుస్తూ ఎమోజీ షేర్‌ చేశారు. ‘‘షార్ట్‌ పొజిషన్లపై గేట్స్‌ను నిలదీశా. శీతోష్ణస్థితి మార్పులపై మా కంపెనీ ఎంతో పోరాటం చేస్తోంది. అలాంటి కంపెనీలో షార్ట్‌ పొజిషన్లు తీసుకున్న గేట్స్‌ దాతృత్వాన్ని, పర్యావరణంపై పోరును నేనైతే సీరియస్‌గా తీసుకోలేను’’ అంటూ దులిపేశారు. పర్యావరణంపై పోరు పేరిట టెస్లా పెద్దగా చేస్తున్నదేమీ లేదంటూ గేట్స్‌ గతంలో ఎద్దేవా చేశారు. కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేసినంత మాత్రాన పర్యావరణ మార్పును అడ్డుకున్నట్టు కాదన్నారు.

ట్విటర్‌పై రగడ
ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడంపై గేట్స్‌ గతంలోనూ నెగెటివ్‌గా స్పందించారు. మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌లో అసత్య సమాచారం మరింత పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పారదర్శకత కూడా లోపిస్తుంది. నేను ప్రోత్సహించే టీకాలు మనుషుల ప్రాణాలు తీస్తాయని, వాళ్లను నేను ట్రాక్‌ చేస్తున్నానని వ్యాఖ్యలు చేసే మస్క్‌ ఆధ్వర్యంలో ట్విటర్‌లో ఎలాంటి వార్తలు వ్యాపిస్తాయో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. అప్పట్నుంచీ గేట్స్‌పై మస్క్‌ గుర్రుగా ఉన్నారు.

తాజా కథనం నేపథ్యంలో తన కసినంతా విమర్శల రూపంలో వెళ్లగక్కారు. అయితే మస్క్‌ ట్వీట్లను పట్టించుకోనని గేట్స్‌ సమాధానమిచ్చారు. గతంలో మస్క్‌ బిట్‌కాయిన్‌లో వాటా కొన్నప్పుడూ గేట్స్‌ పరోక్ష విమర్శలు చేశారు. అయితే వీరి మధ్య విభేదాలు ఇంతలా ఎందుకు పెరిగాయన్నది అంతుబట్టని విషయం. ఈ కొట్లాట మరింత ముదిరితే దాని ప్రభావం వారు పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే నిధులపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.