kరీర్ ప్రారంభంలో ఇష్టం లేని సినిమాల్లోనూ నటించానని తెలిపింది బాలీవుడ్ తార యామీ గౌతమ్. ఏదో ఒక సినిమా చేయాలి కాబట్టి సదరు చిత్రాల్లో నటించానని, అయితే అవి నటిగా తనకేమాత్రం సంతృప్తినివ్వలేదని ఆమె అంటున్నది. ‘వికీ డోనర్’, ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘యురి’ లాంటి చిత్రాలతో ప్రతిభ గల నాయికగా పేరుతెచ్చుకుందీ భామ. ఆమె ఇటీవల సినిమా ‘ఎ థర్స్ డే’ క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రంలో ఆమె పోషించిన ప్రైమరీ స్కూల్ టీచర్ పాత్రకు పేరొచ్చింది.తాజాగా యామీ గౌతమ్ మాట్లాడుతూ…‘కెరీర్ ప్రారంభంలో అనేక భయాలు, అభద్రత నాలో ఉండేవి. వచ్చిన ప్రతి సినిమా అవకాశం కాదనకుండా అంగీకరించా. నటించడం ఇష్టం లేకున్నా చేసేదాన్ని. ఇండస్ట్రీలో ఉన్నందుకు ఏదో ఒక సినిమాలో కనిపించాలనే భయం ఉండేది. కొన్నాళ్లకు ఆ భయాలు, అభద్రతను జయించా. మనసుకు నచ్చిన సినిమాలే చేస్తూ వచ్చా. ఫలితంగా నటిగా మంచి పేరు తెచ్చుకున్నా’ అని చెప్పింది. యామీ ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘ఓ మై గాడ్ 2’ చిత్రంలో నటిస్తున్నది.