బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోన్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టి నాలుగేళ్లవుతున్నది. వీళ్ల ప్రేమ కథకు మాత్రం పదేళ్ల వయసొచ్చింది. ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమా సమయంలో ఈ జంట ప్రణయం మొదలైంది. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘83’ వంటి చిత్రాల్లో కలిసి నటించారీ ప్రేమికులు. పెళ్లయ్యాక కూడా దీపికా నాయికగా తన కెరీర్ కొనసాగిస్తున్నది. ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది. తమ ప్రేమానుబంధం గురించి రణ్‌వీర్ సింగ్ తాజాగా స్పందించారు.ఆయన మాట్లాడుతూ…‘తొలిసారి ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమా ప్రచారం కార్యక్రమాల్లో దీపికాను కౌగిలించుకున్నా. ఆమెకు కోపమొచ్చింది. ఇన్నేళ్ల మా అనుబంధంలో దీపికాలో కోపాన్ని, సంతోషాన్ని చూశాను. ఎప్పుడైనా ఆమే నాకు సర్వస్వం. నా ఇష్టసఖి, మంచి స్నేహితురాలు కూడా’ అని అన్నారు. పిల్లల గురించి ఆలోచించారా అని అడిగితే…ఆ విషయం కేన్స్ నుంచి తిరిగొచ్చాక దీపికానే అడగండి అంటూ సమాధానమిచ్చారు రణవీర్ సింగ్. 2018 నవంబర్ 14న ఈ ప్రేమికులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.