గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్, అగ్ర కథానాయిక నయనతార జూన్ 9న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని తొలుత వార్తలొచ్చాయి. గత నెలలో ప్రేమికులిద్దరూ తిరుమల సందర్శించడంతో అక్కడే వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వివాహ వేదికలో మార్పు జరిగినట్లు తెలిసింది. చెన్నైకి దగ్గరలోని మహాబలిపురం వీరి వివాహానికి వేదిక కానున్నట్లు సమాచారం. వీరిద్దరి డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. విఘ్నేష్-నయన్ తమ సన్నిహితులకు ఈ ఆహ్వాన పత్రికను పంపిచారు.అందులో పెళ్లి వేదికగా మహాబలిపురంను పేర్కొన్నారు. ‘జూన్ 9న మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి’ అని ఆహ్వాన పత్రిక ద్వారా కోరారు. విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించిన ‘నానున్ రౌడీదాన్’ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు.