పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌రోడ్ల నిర్మాణం, లెవెలింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి నెలా కనీసం 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు.
‘పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న లేఅవుట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌రోడ్ల నిర్మాణం, లెవెలింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. వాటికి కావాల్సిన రూ.700 కోట్ల నిధులను వారం రోజుల్లో విడుదల చేస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. ప్రతి నెలా కనీసం 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. కోర్టు కేసుల వల్ల పంపిణీ చేయని ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సమీక్షించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమం, ఉపాధి హామీ, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా 2,11,176 మంది లబ్ధిదారులను గుర్తించగా… 1,12,262 మందికి పట్టాల పంపిణీ జరిగిందని, మిగతా 98,914 మందికి అవసరమని భూమిని త్వరలోనే గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం పలు ఆదేశాలిచ్చారు.
జాప్యాన్ని సహించను:
* గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్ విలేజ్ క్లినిక్‌లు, బీఎంసీలు, ఏఎంసీల భవనాల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదు. రుతుపవనాలు ముందుగా వస్తే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* భూముల రీ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు ప్రతి వారం సమీక్షిస్తేనే, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. రోజువారీ పనుల పురోగతిపైనా నివేదిక తెప్పించుకోవాలి.స్పందన పోర్టల్‌లో ఫొటోలు అప్లోడ్ చేయాలి
* గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల్లో ప్రతి సోమవారం స్పందన నిర్వహించాలి. ఆ సమయంలో సంబంధిత అధికారులు పాల్గొంటున్నారో లేదో సమీక్షిస్తాం. స్పందన పోర్టల్‌లో కొన్ని మార్పులు చేస్తున్నాం.
* అర్జీలపై క్షేత్ర స్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ సమయంలో ఫిర్యాదుదారుడు కచ్చితంగా ఉండాలి. క్షేత్ర స్థాయి విచారణకు సంబంధించిన ఫొటోలే కాకుండా, సమస్య పరిష్కారమైన తర్వాత ఫొటోలు కూడా అప్లోడ్ చేయాలి.
* నా కళ్లు, చెవులు మీరే. మీ పనితీరే నా పనితీరు. మనందరి పనితీరు.
* గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యల్ని పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
* మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500కోట్ల నుంచి రూ.600కోట్లు ఖర్చుపెడితే… మనం రూ.1,800కోట్ల నుంచి రూ.1,900కోట్లు ఖర్చు చేస్తున్నాం.
* డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ మూడేళ్లలో రూ.1.41లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారానే అవినీతి, వివక్షకు తావులేకుండా ఇచ్చాం.సాగు నీరు విడుదల ఇలా..
* గోదావరి డెల్టాకు జూన్ 1కే సాగునీరు విడుదల చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. జూన్ 10న కృష్ణా డెల్టాకు, గుంటూరు ఛానల్‌కు, గండికోట కింద, బ్రహ్మసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగు నీరిస్తాం. ఎస్సార్బీసీ కింద గోరకల్లు, అవుకు లకు జూన్ 30న, ఎన్ఎస్పీ కింద జులై 15న నీటిని విడుదల చేస్తాం.
* ఆర్బీకే స్థాయిలో తొలి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు కచ్చితంగా జరగాలి. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి. వాటి నాణ్యతకు మనం భరోసా ఇవ్వాలి. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచాలి. జూన్, జులై మాసాల్లో ఎక్కువ ఎరువులు అవసరమవుతాయి. ఆ మేరకు ప్లాన్ చేసుకోవాలి.
* ప్రతి నెలా జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి. రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌లో రూ.92వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. పంట సాగుదారుల హక్కు కార్డులపై మరింత అవగాహన కలిగించాలి. ప్రతి కౌలు రైతు ఈ కార్డులు పొందాలి.
* జాతీయ రహదారులకు భూసేకరణ వేగవంతం చేయాలి. రూ.2,500కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ రహదారుల కోసం రూ.1072.92కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్ల ఫొటోలతో గ్యాలరీలు ఏర్పాటు చేయండి.
* అత్యంత ప్రాధాన్యమైనవిగా నిర్దేశించుకున్న సాగు నీటి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ సిద్ధం చేయండి.
* జూన్‌లో రైతులకు 3,800 ట్రాక్టర్లు సహా 5 వేలకుపైగా వ్యవసాయ యంత్రాల పంపిణీ. జూన్ 14న పంటల బీమా పరిహారం చెల్లిస్తాం. జూన్ 23న అమ్మఒడి అమలు చేస్తాం.