యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవలే మీడియాతో మాట్లాడిన కమల్.. తన స్నేహితుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రజనీతో సినిమాల నుంచి ప్రజల వరకు అన్ని విషయాలు మాట్లాడే కమల్.. ఓ విషయం గురించి మాత్రం ప్రస్తావన తీసుకురారట. అదేంటంటే..
దేశంలో నటనకు డిక్షనరీ తయారు చేస్తే దాని పేరు.. కమల్ హాసన్. వెండితెరపై జరిగిన ప్రయోగాలకు ఓ యూట్యూబ్ ఛానెల్ పెడితే దాని తంబ్‌నెయిల్.. కమల్‌హాసన్. సినిమా రంగంలో ప్రతిభకు ఇన్‌స్టా పేజీ నడిపించాల్సి వస్తే.. దాని డీపీ కమల్ చిత్రమే. బడిలో అఆలు దిద్దే వయసులోనే కెమెరా ముందుకొచ్చిన కమల్‌హాసన్.. నిత్య విద్యార్థిలా మెలుగుతూ ఆరు పదుల వయసులోనూ అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. మెరుస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘విక్రమ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కమల్ హాసన్ విలేకర్లతో ముచ్చటించారు.ఈ మధ్య మీ స్నేహితుడు రజనీకాంత్‌ని కలిసినట్టున్నారు. ఏం మాట్లాడుకున్నారు?నలభయ్యేళ్లుగా మేం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. సినిమాలు, ప్రజల గురించి ఇలా పలు విషయాలు చర్చకొస్తుంటాయి. ఇప్పుడూ అదే మాట్లాడుకున్నాం. రాజకీయాల ప్రస్తావన మాత్రం రాదు. ఎందుకంటే భిన్నమైన ఫిలాసఫీని నమ్మే వ్యక్తులం మేం. అన్నిటికంటే స్నేహాన్ని ఎక్కువగా గౌరవిస్తాం. ‘విక్రమ్’ వైబ్రేషన్స్ బాగున్నాయంటూ శుభాకాంక్షలు చెప్పారు.
రజనీతో కమల్అడవి.. వేట అంటూ ప్రచార చిత్రంలో ఫిలాసఫీ చెప్పారు. ఇంతకీ సినిమా ఎలా ఉంటుంది?మనం బతుకుతున్న ఈ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ అంటున్నాం. అలా అనుకుంటే మనం అడవిలో ఉన్నట్టే కదా. అదే ఈ సినిమా. డ్రగ్స్, స్మగ్లింగ్.. ఇలా పలు విషయాలు ఉంటాయి. మాదక ద్రవ్యాల విషయంలో అనుకోకుండా, మనకు తెలియకుండానే మనం అందులో భాగమయ్యాం. అదెలా అనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే. విలన్ అంటే ఎక్కడి నుంచో పుట్టుకురాడు. మనలోనే ఉంటాడు. ప్రతి పాత్రలోనూ రెండుకోణాలు ఉంటాయి. నేను స్టార్ అని ఎప్పుడూ చెప్పను. నేనొక నటుడిని. ప్రేక్షకుల దయవల్ల స్టార్‌ని అయ్యా. నా విలన్లు హీరోలకి సమానమైన బలంతో కనిపిస్తారు. నేను రాసిన కథల్లోనూ అంతే. పోస్టర్‌లోనూ ఆ నటులు ప్రధానంగా కనిపిస్తుంటారు.
మీరు నటించే సినిమాల్లో ఏదో ఒక సవాల్ ఉండాల్సిందే కదా. మరి ఇందులో ఏమిటి?ఈరోజుల్లో సినిమా బాగా ఆడటం, బాగుండటం రెండూ సవాల్‌తో కూడుకున్నవే. మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం పంపిణీదారుల్లో చాలా ఉంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. బాలచందర్, విల్సన్ మాస్టర్‌లా అంత ధైర్యం ఉన్నవాళ్లు ఇప్పుడు చాలా తక్కువ.v’విక్రమ్’యువ ప్రతిభావంతులతో కలిసి పనిచేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?ఇప్పుడు యువకులు కావొచ్చు, ఇంకో ఇరవయ్యేళ్ల తర్వాత వీళ్లే ఎంతో ఎత్తులో కనిపిస్తారు. లోకేశ్‌కి ఇది నాలుగో చిత్రం. భారతీరాజా నాతో తన తొలి సినిమాని చేశారు. భారతీరాజా, బాలు మహేంద్ర, బాలచందర్‌లతో ప్రయాణం గురించి ఆలోచిస్తే.. అప్పట్లో అందరం సరదాగా అనుకుని చేసేవాళ్లం. ‘మరోచరిత్ర’, ‘వసంతకోకిల’.. వీటి గురించి ఇప్పుడు ఆలోచిస్తే వాళ్లు అప్పట్లోనే ఎంత సాహసం చేశారన్నది అర్థమవుతోంది.