దేశమన్నా ఇక్కడి ప్రజలన్నా అమితంగా ఇష్టపడే రతన్‌టాటా ఓ విదేశీ కంపెనీ భారతీయులపై చూపించిన తల పొగరుకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను బిర్లాల కుటుంబ సభ్యుడు వేదాంత్ బిర్లా ట్విటర్లో షేర్ చేశారు. జేఎల్ఆర్ను టాటా టేకోవర్ చేసి పద్నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రతన్‌టాటా గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ఫోర్డ్‌పై టాటా ప్రతీకారం తీర్చుకున్న తీరు..
అంబాసిడర్ కారు మినహా 90వ దశకం వరకు పూర్తిగా స్వదేశీ కార్లు ఇండియాలో అందుబాటులో లేవు. జపాన్, అమెరికా, కొరియా అందించే సాంకేతిక సహకారంతో దేశీయంగా అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ పూర్తి స్వదేశీ కారు లేదు. ఆ లోటు భర్తీ చేసేందుకు రతన్ టాటా ఇండికా పేరుతో స్వదేశీ కారుని 1998లో మార్కెట్లోకి తెచ్చారు టాటా. కానీ ఆ కారు ముందుగా అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించిన నష్టాలు వచ్చాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు, సరైన పరిష్కారం కనుగొనేందుకు 1999లో అమెరికా ఫ్లైట్ ఎక్కారు రతన్ టాటా.
మీకెందుకయ్యా కార్లు
అమెరికా వెళ్లిన రతన్‌టాటా అక్కడ ఫోర్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇండియా నష్టాల కారణంగా కార్ల తయారీ యూనిట్‌ను కొనుగోలు చేయాలంటూ ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరిపాడు. అప్పుడు ఆ కంపనీ బాస్‌గా ఉన్న బిల్లీఫోర్డ్ భారత్‌ను మరీ తక్కువ చేసి మాట్లాడారు. కార్ల గురించి ఏమీ తెలియని మీకు ఎందుకు సొంత కార్లు ? అంటూ హేళనగా మాట్లాడారు. ఇండికాను మా మద్దతు ఇవ్వలేం. కంపెనీ మూసేయండంటూ ఉచిత సలహా ఇచ్చారు.
అవమాన భారంతో
ఫోర్డ్ చేసిన వ్యాఖ్యలను నొచ్చుకున్న రతన్ టాటా ఇండియాకి తిరిగి వచ్చారు. రిసెర్చ్ డిపార్ట్మెంటుతో కూర్చుని ఇండికాలోని లోపాలను, మార్కెట్ వ్యూహాలను మరోసారి పరిశీలించుకున్నారు. పట్టుదలతో శ్రమించి ఇండికాను లోపాలను సవరించి మరింత ఆకర్షీయంగా మార్చారు. అంతే దేశీ రోడ్లపై ఇండికా తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికీ ఇండికాకు ఆదరణ తగ్గలేదు.
ఫోర్డ్‌ను ఆదుకున్న టాటా
ఇండికా డీల్ ఘటన జరిగిన పదేళ్లకు 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఫోర్డ్ కంపెనీ పునాదులు కదిలిపోయాయి. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక దివాలా అంచులకు చేరింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కెందు ఫోర్డ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జాగ్వార్, ల్యాండ్‌రోవర్ (జేఎలర్ఆర్)లను కొనుగోలు చేసి ఫోర్డ్ కంపెనీ దివాలా తీయకుండా ఒడ్డున పడేశారు రతన్ టాటా. అలా భారతీయులను అవమానించిన అమెరికన్ ఫోర్డ్‌పై స్వీట్ రివేంజ్ తీర్చుకున్నారు.
గ్లోబల్ కంపెనీగా
ఇండికా ఇచ్చిన స్ఫూర్తితో టాటా మోటార్స్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. బ్రెజిల్‌కి చెందిన మార్క్పోలోతో కలిసి బస్సులు, సౌత్ కొరియాకు చెందిన దేవూతో కలిసి ట్రక్కులు, జపాన్‌కి చెందిన హిటాచితో కలిసి హెవీ మెషినరీ, ఏయిరో స్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ప్రస్తుతం టాటా దూసుకుపోతుంది.