DailyDose

అమెరికాలో పెట్రోల్‌ భగభగ

అమెరికాలో పెట్రోల్‌ భగభగ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమెరికా వినియోగదారుల్నీ ఠారెత్తిస్తున్నాయి. గురువారం అక్కడ ఒక గ్యాలన్‌ (సుమారు 4.54 లీటర్లు) పెట్రోల్‌ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా 4.71 డాలర్లకు చేరింది. యూరప్‌లోనూ ఇదే పరిస్థితి. దీంతో అక్కడి దేశాలు ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. నెలకు పది డాలర్ల పాస్‌తో రోజుకు ఎన్నిసార్లయినా లోకల్‌ రైళ్లు, బస్సులు, సబ్‌వేల్లో ప్రయాణించేందుకు జర్మనీ ప్రభుత్వం అనుమతించింది.

సరే కొద్దిగా పెంచుతాం:
ఈ హాహాకారాలతో రోజువారీ చమురు ఉత్పత్తి కొద్దిగా పెంచేందుకు చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్‌ అంగీకరించింది. వచ్చే నెల నుంచి రెండు నెలల పాటు రోజువారీ ఉత్పత్తి 6.48 లక్షల బ్యారళ్ల మేర పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం లేని రష్యా కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. చమురు సెగతో ఆర్థిక వృద్ధి రేటు మందగించి మళ్లీ చమురుకు ఎక్కడ గిరాకీ తగ్గుతుందోననే భయమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఒపెక్‌ తాజా నిర్ణయంతో బ్యారల్‌ చమురు ధర 121 డాలర్ల నుంచి 114 డాలర్లకు దిగొచ్చింది.

ఆదుకోండి:
మరోవైపు భారత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ)లు నష్టాల నుంచి ఏదోలా రక్షించమని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ఓఎంసీలు గత రెండు నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నాయి. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.17.10, డీజిల్‌పై రూ.20.4 చొప్పున నష్టం వస్తోంది. ధరలు పెంచుకునేందుకు అనుమతించడం లేదా ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా ఈ విషయంలో ఆదుకోవాలని ఓఎం సీల అధిపతులు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురిని కోరినట్టు సమాచారం.