Food

వరిపేలాలతో గర్భిణుల వేవిళ్లకు చెక్ పెట్టొచ్చు

Puffed rice can help pregnant ladies to get relief from nausea

ఇంటి వైద్యం గర్భం దాల్చిన తొలినాళ్లలో చాలామందికి ఎదురయ్యే సమస్య వేవిళ్లు. వికారం, వాంతులతో ఇబ్బందిపెట్టే ఈ సమస్యను అదుపులో ఉంచుకోగలిగితే తల్లి కాబోతున్న సంతోషాన్ని మనసారా ఆస్వాదించొచ్చు. ఇంట్లో కొన్ని చిట్కాలు అనుసరించి వేవిళ్లను ఎలా తగ్గించుకోవాలో చూద్దామా… వేవిళ్ల సమస్య ఉన్నప్పుడు వికారంగా అనిపిస్తుంది. వాంతి వచ్చినట్లు ఉంటుంది. ఒక్కోసారి వాంతులు అవుతూనే ఉంటాయి. గర్భం దాల్చినప్పుడు హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. మొదటి మూడు నెలల్లో వేవిళ్లు ఎక్కువగా ఉండి, తరువాత తగ్గుతాయి. కొంతమందికి మాత్రం నెలలు నిండే వరకు వికారం, వాంతులు తగ్గవు. ఆహారం… గర్భిణులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎంచుకోవాలి. పండ్లు, పాలు, ఉడికించి వండిన ఆకు కూరలు, ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా… కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినే ప్రయత్నం చేయాలి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు, గ్రేవీ కూరలు తగ్గించాలి. పులుపు, ఉప్పు, కొంచెం కారం ఉన్న పదార్థాలు ఎంచుకుంటే వికారం తగ్గుముఖం పడుతుంది. అలాగే అల్లం, నిమ్మ, కరివేపాకు, ధనియాలు, జీలకర్రను వంటల్లో ఎక్కువగా వాడాలి. దానిమ్మ గింజలను నమిలితే వికారం తగ్గుతుంది. కమలాఫలం తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
***ఈ చిట్కాలతో…
* కప్పు నీళ్లలో చెంచా అల్లం ముద్ద వేసి టీ లా కాచి, వడబోయాలి. ఇందులో చెంచా తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే వికారం అదుపులో ఉంటుంది.
* రెండు చెంచాల ఉసిరి రసానికి చెంచా చొప్పున అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే మంచిది.
* అరచెంచా నిమ్మరసానికి చెంచా చొప్పున అల్లం రసం, తేనె కలిపి తాగాలి.
* గ్లాసు నీటిలో అరచెంచా కరివేపాకు రసం, చెంచా చొప్పున నిమ్మరసం, తేనె, కొద్దిగా పటిక బెల్లం కలిపి పరగడుపున తాగితే, వికారం నుంచి ఉపశమనం పొందొచ్చు.
* 50 గ్రాముల వరిపేలాలను మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనికి రెండు చెంచాల పటిక బెల్లం పొడి, పావు చెంచా యాలకుల పొడి కలిపి భద్రపరుచుకోవాలి. ఈ పొడిని రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకుంటే వాంతులకు దూరంగా ఉండొచ్చు.