Politics

రెండవ రోజు అసెంబ్లీలో రగడ రగడ-TNI కధనాలు

Andhra Assembly Sessions 2019 - YS Jagan vs Chandrababu - TNI Stories

1. 23వ తేదీ … 23మంది కరెక్ట్ జడ్జిమెంట్ – ముఖ్యమంత్రి జగన్
గత శాసనసభలో అధికార టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు కలిసి సరైన జడ్జిమెంట్‌ ఇచ్చారని, అయినా కుక్క తోక వంకర అన్న చందం‍గా టీడీపీ తీరు మారడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ముగ్గురు ఎంపీలను కూడా కొనుగోలు చేశారని, చివరకు ఏం జరిగిందని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. పైన దేవుడు, ప్రజలు కలిసి గూబ గూయ్‌మనే రీతిలో ఈ అన్యాయాలను తిప్పికొట్టారని, అన్యాయం చేసిన మాదిరిగానే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇచ్చారని, అదీ కూడా సరిగ్గా 23వ తారీఖు నాడే ఇచ్చారని, దేవుడు, ప్రజలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్‌ ఇదని, ఇంతకన్నా కరెక్ట్‌ జడ్జిమెంట్‌ ఉండదని పేర్కొన్నారు. స్పీకర్‌కు ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి.. మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టి ఉంటే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కి ఉండేది కాదని అన్నారు. ఎంతమంది టీడీపీ సభ్యులు తనతో టచ్‌లో ఉన్నారో చెప్పడం లేదని, అందుకు సంతోషపడాలని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులనే ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగవద్దని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్ష సభ్యులు కొనసాగాలని, పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొత్త సంప్రదాయం రావాలని తాము కోరుకుంటుంటే.. దానిని కూడా వక్రీకరించి.. టీడీపీ సభ్యులు అన్యాయంగా మాట్లాడుతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.
2. రెండో రోజే అంత అసహనం ఎందుకు?: రోజా
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపే వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సభలో మాట్లాడుతూ.. స్పీకర్‌గా ఎన్నికైనందుకు తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపారు. ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని ఉదాహరణగా తీసుకుంటామని.. ఈ రోజు సభలో కొందరు చెప్పిన మాటల విషయంలో తెదేపా ఎమ్మెల్యేలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థంకావట్లేదన్నారు.
3. దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలవాలి:తమ్మినేని
శాసనసభలో గతంలో పెద్దలు విశిష్ట సంప్రదాయాలు నెలకొల్పారని.. వాటిని కొనసాగించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్‌ సభాపతి తమ్మినేని సీతారామ్‌ అన్నారు. సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు సార్లు మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని.. ఈ సభే తనకు అనుభవాన్ని ఇచ్చిందన్నారు. స్పీకర్‌ ఎన్నికపై ధన్యవాదాల అంశంపై చర్చ అనంతరం తమ్మినేని మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని సభ్యులకు సూచించారు. సభాగౌరవాన్ని కాపాడుకోవాలని.. దీనికి అధికార, ప్రతిపక్ష సభ్యులు సహకరించాలన్నారు.
4. జగన్‌, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. ‘‘ముగ్గురు ఎంపీలను ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు.
5.పోరాటాలు కొత్త కాదు- చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాద్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారాంకు ప్రతిపక్షం నేత చంద్రబాబునాయుడు అభివందనం తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత ఎపీకి రెండో సభాపతిగా సీతారం ఎన్నిక కావడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకు అభినందనలు తమ్మినేనికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ పిలుపు నందుకుని విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనేక శాఖలకు మంత్రిగా పని చేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించినది అని చంద్రబాబు అన్నారు.
6. అప్పుడే సభలో జగన్ స్పష్టం చేశారు- పయ్యావుల
గత సభలో స్పెకర్ ఎన్నికపై విపక్షనికి సమాచారం ఇచ్చామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీలో స్పీకర్ ను కూర్చోబెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబును పిలవలేదన్న విషయమై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ తాము యనమల ద్వారా సమాచారం ఇచ్చిన విషయాన్నీ అప్పుడే సభలో జగన్ తెలియజేశారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగంలోని విచాయలను పయ్యావుల చదివి వినిపించారు.
7.జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – బుద్దా
ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వైకాపాలోకి వస్తే రాజీనామా చేసి రావాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్ని తానూ స్వాగతిస్తున్నామని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. పోలవరం గురించి కనీసం సమీక్ష చేయకుండా గత ప్రభుత్వం పనితీరును ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. తెదేపా ప్రవేశ పెట్టిన పధకాలను తొలగించినా మేము ఏం మాట్లాడటం లేదన్నారు. కొత్త ప్రభుత్వం పనితీరు చూసేందుకు కొంత సమయం వేచి ఉండాలని భావిస్తున్నామన్నారు. కానీ అనవసరంగా నోరు పరేసుకుంటే మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరానేది గుర్తు ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు.