NRI-NRT

విప్రో సీఈవో గతేడాది వార్షిక జీతం ఎంతో తెలుసా..

విప్రో సీఈవో  గతేడాది వార్షిక జీతం ఎంతో తెలుసా..

భారత్‌లో అధిక వేతనాలు స్వీకరిస్తున్న వ్యక్తుల జాబితాలో దేశీయ ఐటీ కంపెనీల సీఈవోలు ముందువరుసలో ఉంటున్నారు. విప్రో సీఈవో థియర్రీ డెలాపోర్ట్ మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.79.8 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. డాలర్ల పరిభాషలో 10.51 మిలియన్ డాలర్లు అందుకున్నారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌ వద్ద వార్షిక రిపోర్టు ఫైలింగ్‌లో విప్రో వెల్లడించింది. దీంతో భారత ఐటీ రంగంలో గతేడాది అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా డెలాపోర్ట్ నిలిచారు. కాగా అంతకుముందు ఏడాది 2020-21లో ఆయన వార్షిక వేతనం రూ.64.3 కోట్లు(8.7 మిలియన్ డాలర్లు)గా ఉంది. అయితే జులై 2020లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో ఆ ఆర్థిక సంవత్సరంలో 9 నెలలు మాత్రమే పనిచేశారు. అందుకే వార్షికవేతనంలో తగ్గుదల ఉంది.

కాగా 2021-22లో డెలాపోర్ట్ తన వేతనం, అలవెన్సుల్లో 1.74 మిలియన్ డాలర్లు(13.2 కోట్లు) ఇంటికి తీసుకెళ్లగా.. కమీషన్లు, వేరియబుల్ చెల్లింపులు రూ.2.55 మిలియన్ డాలర్లు(రూ.19.3 కోట్లు), ఇతర ప్రయోజనాల కింద 4.2 మిలియన్ డాలర్లు(రూ.31.8 కోట్లు)గా ఉన్నాయి. మిగతావి దీర్ఘకాల పరిహారాలుగా ఉన్నాయని విప్రో వివరించింది. పరిహారం ప్యాకేజీలో షేర్ హోల్డర్లు ఆమోదించిన వన్-టైమ్ క్యాష్ అవార్డ్ ఉంది.

కాగా ఐటీ రంగంలోని ఇతర కంపెనీల సీఈవోల జీతాలను ఒకసారి పరిశీలిస్తే… ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ జీతం ఆర్థిక సంవత్సరం 2022లో 43 శాతం మేర వృద్ధి చెంది రూ.71 కోట్లకు చేరింది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ ఆర్థిక సంవత్సరం 2022లో 27 శాతం జంప్ అయ్యి రూ.25.77 కోట్లకు పెరిగింది. ఇక విప్రో చైర్మన్ రిశాద్ ప్రేమ్‌జీ గతేడాది 1.82 మిలియన్ డాలర్ల వార్షిక వేతనాన్ని పొందారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.13.8 కోట్లతో సమానం.