రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించే దిశగా ప్రయత్నాలకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పదును పెడుతున్నారు.ఇందుకోసం ఇప్పటికే పలు విపక్ష నేతలతో వరుస సంప్రదింపులు జరిపిన ఆమె, వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖర్గే తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
ఆమెతో పాటు డీఎంకే నేత తిరుచి శివ, ఆప్ నేత సంజయ్ సింగ్‌తో పాటు వామపక్షాల నేతలకు కూడా ఆయన ఫోన్లు చేశారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఖర్గే చర్చించనున్నారు. ఆయన చర్చల సందర్భంగా ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయానికి మమత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. దీనిపై త్వరలో ప్రాంతీయ పార్టీలతో సంయుక్త సమావేశం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి ఈ విషయమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు పవార్ కూడా సానుకూలమేనని ఖర్గే అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్, బీజేడీ అనుసరించబోయే వైఖరిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వాటితో చర్చలకు కాంగ్రెసేతర నేతలను పురమాయించాలన్న యోచన కూడా ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న తృణమూల్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉండటం ఏకాభిప్రాయ సాధన ప్రయత్నాలకు అడ్డంకిగా కన్పిస్తోంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసేతర నేతను బరిలో దించాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం.
*’ఒక్క’ శాతంపై బీజేపీ దృష్టి
రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన 1.1 శాతం ఓట్లపై బీజేపీ కూడా దృష్టి సారించింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల మొత్తం ఓట్ల విలువ 10.86 లక్షల్లో బీజేపీకి 48.9 శాతం ఉన్నాయి. దాంతో మిగతా 11,990 ఓట్ల కోసం ప్రాంతీయ పార్టీలను బీజేపీ సంప్రదిస్తోంది. ముఖ్యంగా బిజూ జనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై నమ్మకం పెట్టుకుంది.రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే ఆ పార్టీల చీఫ్‌లు నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఎలక్టోరల్ కాలేజీలో బీజేడీకి 13 వేల పై చిలుకు, వైఎస్సార్‌సీపీకి 45 వేల పై చిలుకు ఓట్లున్నాయి. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతూ తమకేనని బీజేపీ అంటోంది. ఆయనతోనూ చర్చలకు ప్రత్యేక బృందాన్ని పంపనుంది.