1. టిటిడి కల్యాణ మండపాలు ఆధునికీకరణ – ఆద్యాత్మిక వార్తలు
దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాల ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, శ్రీకాకుళం జిల్లా రాజం, తెలంగాణ రాష్ట్రం మహబుబ్‌నగర్‌లోని టిటిడి కల్యాణ మండపాలను అద్భుతంగా తీర్చిదిద్ధారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో కల్యాణ మండపాలను మరమత్తులు చేసి ఆకర్షణీయంగా రంగులు వేశారు. కల్యాణ మండపంలో వంట, భోజనశాల, వధువు, వరుడు గదులను ఆధునీకరించారు. కల్యాణ మండపం లోపల ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం, గోడలపై శ్రీవారి వివిధ అంకరణలతో కూడిన ఫోటోలు, బయటి గోడలపై ఆకట్టుకునేల పెయింటింగ్ ఏర్పాటు చేశారు. కల్యాణ మండపంలో పారిశుద్ద్యనికి పెద్ద పీట వేస్తూ, డ్రైనేజి, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ మండపం లోపల, బయట అహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా వివిధ పుష్పాల మొక్కలతో గార్డన్ ఏర్పాటు చేశారు. చాలా కల్యాణ మండపాలు ఆధునీకరణ పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని మండపాలను ఆధునిక వసతులతో అందుబాటులోనికి రానున్నాయి. ఇటీవల కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగళూరులోని కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించిన విషయం విదితమే.
**ఆన్‌లైన్‌లో 256 టిటిడి కల్యాణమండపాల బుకింగ్ సదుపాయం
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 302 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇందులో 256 కల్యాణ మండపాలను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో 184, తెలంగాణలో 65, ఒడిశాలో 01, కర్ణాటకలో 03, కేరళలో 01, తమిళనాడులో 02 కల్యాణ మండపాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. టిటిడి కల్యాణమండపాల్లో అత్యాధునిక వసతులు కల్పించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం టిటిడి కల్పించింది. వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్ వంటి శుభకార్యాలకు టిటిడి కల్యాణమండపాలను బుక్ చేసుకోవచ్చు.
**ఎలా బుక్ చేసుకోవాలి..
ttdsevaonline.com వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదోఒకటి అప్‌లోడ్ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండి https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
2. మూడునెలల్లో యాదాద్రి విస్తరణ పనులు పూర్తి
శ్రీ లక్ష్మీనారసింహుడు స్వయంభువుడిగా కొలువై ఉన్న గర్భగుడిలో ఫ్లోరింగ్ పనులను చేపట్టారు. మరో మూడునెలల్లో యాదాద్రి విస్తరణ పనులను పూర్తి చేయాలని యాడా యత్నిస్తోంది. ప్రధాన ఆలయ మాఢ వీధుల్లో చేపట్టిన పైపుల ఏర్పాటు పనులు ముగియడంతో మండపాల పనులను మళ్లీ చేపట్టారు. గర్భగుడిలో జరుగుతున్న ఫ్లోరింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు యాడా చెబుతోంది. ప్రధానాలయంలోని ముఖ మండపంలోనూ కృష్ణశిలతో రూపొందించే పనులు కొనసాగుతున్నందున స్పెషల్ పోలీస్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్)తో ప్రత్యేక భద్రత కల్పించారు. కీలక పనుల దృష్ట్యా సందర్శకులను అనుమతించడంలేదన్నారు. రామానుజ కూటమి, శయన మండపం, గర్భాలయ ద్వారంపై ఆధ్యాత్మిక చిహ్నాలు, గరుడ ఆళ్వారులు, ఆంజనేయస్వామి రూపాలకు మెరుగులు దిద్దుతున్నారు. గర్భగుడిలోని సహజ సిద్ధమైన గుహను ఉన్నది ఉన్నట్లే ఉంచి అడుగు భాగంలో లోతు చేసి ఫ్లోరింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ ద్వారం గుండా మెట్ల దారి పునర్నిర్మాణం జరుగుతోంది. ఆలయ పడమటి దిశలో వేంచేపు మండపం నిర్మితమవుతోంది. మహారాజగోపురం చెంత ఆధ్యాత్మిక నగిషీలతో సిద్ధమవుతోన్న వేంచేపు మండపం, శ్రీస్వామి అమ్మవారల సేవోత్సవాల సేవకు వినియోగిస్తారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా చేపట్టిన మండపం పైబీములు బిగించే పనులను గురువారం చేపట్టారు.
3. భద్రాచలం తెలంగాణదే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టీకరణ
ప్రసిద్ధ భద్రాచలం పట్టణం ఎన్నటికీ తెలంగాణదేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహమూ అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్న ఆయన.. ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ, భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనే లేదన్నారు. గత నాలుగేళ్లుగా భద్రాద్రి రాముడికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తోందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి పనిచేస్తున్నారన్నారు.
4. సత్యసాయి ట్రస్టు సేవలు అమోఘం : రాష్ట్రపతి
సత్యసాయి ట్రస్టు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అమోఘమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పేర్కొన్నారు. గురువారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్.జె.రత్నాకర్, చక్రవర్తి, నాగానంద, ఏపీ మిశ్రా మర్యాద పూర్వకంగా కలిసి.. ట్రస్టు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. త్వరలో పుట్టపర్తి వస్తానని రాష్ట్రపతి వారికి చెప్పారు.
5. జులై 15 వరకు సిఫార్సు లేఖలు స్వీకరించం- స్పష్టంచేసిన తితిదే
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనార్థం జులై 15 వరకు వారాంతంలో సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తితిదే స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటించినా ఇటీవల సిఫార్సు లేఖల తాకిడి పెరిగింది. దీంతో గురువారం మరోసారి ప్రకటన జారీ చేసింది. శ్రీవారికి శుక్రవారాభిషేకం నేపథ్యంలో ఏడాది పొడవునా శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. భక్తుల రద్దీ కొనసాగుతున్నందున శని, ఆదివారాల్లోనూ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
6. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.
7. శుభమస్తు
తేది : 14, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(నిన్న సాయంత్రం 4 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 10 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 18 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 24 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 17 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 10 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 ॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : తుల
8. చరిత్రలో ఈ రోజు/జూన్ 14
1900: హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
1926: అమెరికన్ చిత్రకారిణి మరియు ముద్రణకర్త మేరీ కస్సట్ మరణం (జ.1844).
1928:దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా జననం (మ.1967).
1938: మొట్టమొదటి సూపర్‌మ్యాన్ పుస్తకము విడుదలయ్యింది.
1967: భారతీయ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ (వ్యాపార సముదాయం) అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లా జననం.
1969: జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ జననం
1982: ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
2005: ప్రపంచ రక్త దాతల రోజు
9. శ్రీవారి సేవలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్
తిరుమల శ్రీవారిని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారికి నిర్వహించిన అభిషేకం సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రికి తితిదే జేఈవో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.
10. చిన్నశేషవాహనంపై శ్రీ బద్రీనారాయణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై శ్రీ బద్రీనారాయణుడి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజు ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కల్యాణప్రదులై, సుఖశాంతులతో ఆనందజీవులతారు. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేపట్టారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరుగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నార శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్రహంచనున్నారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ కళ్యాణ మండపాలు ఆధునికీకరణ
Related tags :