వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి.
రంగుల వర్ణాలు
వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్‌ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి.
లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్‌ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్‌ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్‌గా ఈ కాలం బాగుంటాయి. ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్‌లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్‌ను ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్, టోట్‌తో చేసిన అధునాతన బ్యాగ్‌లు వాడటం మేలు. తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్‌లతో కూడిన హెయిర్‌స్టైల్స్‌కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్‌లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్‌స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్‌కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు.
కాంతిమంతం
అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్‌గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.
తేలికైన సిల్క్ ప్రింట్లు
‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్‌కి గ్లామరస్ టచ్‌ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి.