మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో బీజేపీలో మంత్రిగా చేసిన యశ్వంత్ .. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోనున్నట్లు ఇవాళ తన ట్విట్టర్లో యశ్వంత్ తెలిపారు. విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మీటింగ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అభ్యర్థి అంశం తేలలేదు. కానీ ఇవాళ యశ్వంత్ చేసిన ట్వీట్‌తో కొంత క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ సేవను పక్కనపెట్టి మరింత విస్తృత సమాజ సేవ చేయాల్సిన తరుణం ఆసన్నమైనట్లు యశ్వంత్ తన ట్వీట్లో తెలిపారు. ఆ ట్వీట్ ఆధారంగా విపక్షాల తరపున యశ్వంత్ రాష్ట్రపతి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని తేల్చనున్నది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.