DailyDose

ఈలాన్‌ మస్క్‌ మరో అడుగు ముందుకు

ఈలాన్‌ మస్క్‌ మరో అడుగు ముందుకు

బిలియనీర్‌, టెస్లా సీఈవో ఈలాన్‌ మస్క్‌, మైక్రో-బ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌ డీల్‌కు ట్విటర్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ ఇప్పటిదాకా పెండింగ్‌ ఉన్న సంగతి తెలిసింది. తాజాగా డీల్‌కు ట్విటర్‌ బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేయడంతో మెర్జర్‌ డీల్‌కు మరో అడుగు ముందుకు పడింది.

ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. ప్రత్యేక స్టాక్‌హోల్డర్ల సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించాలా అనేదానిపై ఇన్వెస్టర్లు ఓటు వేయ నున్నారు. షేర్‌హోల్డర్‌లు తమ స్టాక్‌లోని ప్రతి షేరుకు 54.20డాలర్ల నగదుకు అర్హులు. ఇది మస్క్ తన తొమ్మిది శాతం వాటా కొనుగోలుకు చివరి రోజు ట్రేడింగ్ విలువను పరగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ట్విటర్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌ సమాచారాన్ని టెక్‌ క్రంచ్‌ వెల్లడించింది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉన్నాయని వాదిస్తున్న మస్క్‌ ఇటీవల ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ డీల్‌కు సంబంధించి మరో ప్రధాన అడ్డంకి వాటాదారుల ఆమోదం కూడా ఒకటని అన్నారు. అయితే గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీల్‌ విషయంలో ముందుకు సాగాలనే భావిస్తున్నట్టు మస్క్‌ పేర్కొన్నారు.