వివాహ ఆహ్వానపత్రికలో తమతో పాటు తమకు అత్యంత ఆత్మీయులైన ఐదారుగురి పేర్లు వేయడం కద్దు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా 900 కుటుంబాలకు చెందిన భార్యాభర్తల పేర్లను ఆహ్వాన పత్రికలో చేర్చి విస్మయపరిచాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా మలాపురం పంచాయతీ అధ్యక్షుడైన రమేష్ కుమార్తె షాలిని వివాహం ఈ నెల 24వ తేదీన జరగ నుంది. మలాపురం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో 900 కుటుంబాలు నివసిస్తున్నాయి. తన కుమార్తె వివాహానికి రమ్మనాలంటూ రమేష్ అందిస్తున్న శుభలేఖ చూసి ఈ గ్రామాల వాసులు మురిసిపోతున్నారు. ఆ ఆహ్వాన పత్రికలో 5 గ్రామాలకు చెందిన అన్ని కుటుంబాల పేర్లు ఉండ డమే అందుకు కారణం. తన పంచాయతీ అంతా ఒకే కుటుంబమన్న భావన ఉండాలన్న ఉద్దేశంతో రమేష్ ఈ పనికి పూనుకోగా.. ఆ ఇంట శుభకార్యం తమ ఇంట్లోనే అన్నట్టు పెళ్లిపనులను 5 గ్రామాల ప్రజలు భుజాన వేసుకుని నడిపిస్తున్నారు.