బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో గ్రోఫర్స్ ఇండియా)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,447.5 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డు బ్లింక్ కామర్స్‌కు చెందిన 33,018 ఈక్విటీ షేర్ల కొనుగోలుకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వివరించింది. రూ. 1 ముఖవిలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే బీసీపీఎల్‌లో 1 ఈక్విటీ షేరుతోపాటు మరో 3,248 ప్రిఫరెన్స్ షేర్లను కలిగి ఉంది. క్విక్ కామర్స్ బిజినెస్‌లో పెట్టుబడి వ్యూహాలకు అనుగుణంగా బీసీపీఎల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు జొమాటో ఈ సందర్భంగా పేర్కొంది. బ్లింకిట్ బ్రాండుతో బీసీపీఎల్ ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులను అందిస్తున్న విషయం విదితమే. కాగా, బ్లింకిట్ కొనుగోలు తదుపరి రెండు కంపెనీల యాప్స్ విడిగా కొనసాగనున్నట్లు జొమాటో వెల్లడించింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో జొమాటో షేరు నామమాత్ర లాభంతో రూ. 70.15 వద్ద ముగిసింది.