Devotional

జులై 3 నుంచి కల్యాణ వేంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు

జులై  3 నుంచి కల్యాణ వేంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీర‌బ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, జూలై 3 నుంచి 5 వరకు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జూలై 3, 4, 5వ తేదీలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనుననారు. శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి జూలై 3న‌ పెద్దశేష వాహ‌నంపై, జూలై 4న హనుమంత వాహనంపై, జూలై 5న గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శన‌మిస్తారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఆల‌య ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
**జూలై 6న పార్వేట ఉత్సవం
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 6న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.