ఆడపిల్లలకు అందం గోరింటాకు ! అతివల చేతుల్లో అలంకరణగా మారి ప్రత్యేక ఆకర్షణనిస్తుంది గోరింటాకు ! అనాది నుంచి నేటి టాటూల యుగం వరకు అమ్మాయిలకు ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిందీ గోరింటాకు !! అందుకే పెండ్లి అయినా పేరంటమైనా.. పండుగ అయినా ఫంక్షన్ అయినా పడుచుపిల్ల మొదలు పండు ముసలి.. పాలబుగ్గల చిన్నారుల దాకా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. అయితే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరింటాకు పెట్టుకుంటే కలిగే లాభాలు
భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వెనుక కూడా అలాంటి ఒక ప్రయోజనమే ఉంది. సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో సూక్ష్మజీవులు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా నీటితో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ల చేతులు, కాళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీనివల్ల వాళ్లు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతోంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చు.
పురాణాల్లోనూ గోరింటాకు పుట్టుక
గోరింటాకు గౌరీదేవి ప్రతీక. గౌరి ఇంటి ఆకు.. గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే.. గౌరీ దేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీ దేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్కగా ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పరిగెత్తుకుంటూ వెళ్లి పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు. సతీసమేతంగా పర్వతరాజు.. వనానికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అప్పుడు గౌరీ దేవి చిన్న పిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆ ఆకు తగలగానే గౌరీదేవి వేళ్లు ఎర్రబడిపోతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు.. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని విచారం వ్యక్తం చేసేలోపే.. గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది. పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది. అప్పుడు పర్వతరాజు ఉండి.. ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలిపాడు. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని తెలిపాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ పుట్టిందని చెబుతుంటారు.