Politics

ప్రత్యేక హోదా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి-ఢిల్లీలో జగన్

Andhra CM YS Jagan Requests Special Status In Neethi Aayog Meeting In Delhi

ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.

తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి అన్ని రంగాల్లో తమను ఆదుకోవాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడిన సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదికను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, నీతి ఆయోగ్ సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.

నివేదికలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అభివృద్ధి కోరుతూ కీలక అంశాలను ప్రస్థావించారు.

14వ ఆర్థిక సంఘం 2015- 20 మధ్య ఏపీ రెవెన్యూ లోటును రూ.22,113 కోట్లుగా అంచనా వేసిందన్నారు. 

గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షా 18వేల కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ ఉంటే గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు 66,362 కోట్లుగా ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని చెప్పుకొచ్చారు. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414  అయితే ఏపీలో రూ.8,397 మాత్రమేనని సమావేశంలో ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా ఇస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు వస్తాయన్నారు.

హైదరాబాద్‌ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం అన్న వైయస్ జగన్ రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్లు అప్పులు ఉంటే అవి కాస్త 2018 -19 నాటికి రూ.2లక్షల 58వేల కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు.

ఏడాదికి రూ.20వేల కోట్ల వడ్డీ, రూ.20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోందని నీతి ఆయోగ్ కమిటీ ముందు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదన్న జగన్ చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లడంపై సమావేశంలో ప్రస్తావించారు.

రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. హోదా ఇస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుందని సీఎం జగన్‌ తన నివేదికలో పేర్కొన్నారు.