టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు షెల్ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్ల రూపాయలను తన జేబులోకి మళ్లించుకున్న వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. మధుకాన్ సంస్థలకు చెందిన రూ. 96.21 కోట్లను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీని నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది.
కానీ నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది.