పిల్లలను చల్లగా కాచే పోచమ్మ. ఆడపడుచులకు అండగా ఉండే ముత్యాలమ్మ. పొలిమేరలకు రక్షణగా నిలిచే పోలేరమ్మ. మహమ్మారులను మటుమాయం చేసే మాంకాళమ్మ. ముక్కోటి దేవతల శక్తిని కూడదీసుకున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. వీసమెత్తు పసుపుతో అలంకరిస్తే.. నిలువెత్తు నిదర్శనమై కరుణిస్తుంది. నిండైన మనసుతో బోనం సమర్పిస్తే.. మెండైన అనుగ్రహం కురిపిస్తుంది. ఆషాఢ మాసం రాకతో, ఆ తల్లిని కొలిచే బోనాల సంబురం మొదలైంది. పట్నవాసంలో ఇంకిపోయిన పల్లెవాసనను విరజిమ్మే అమ్మవారి ఉత్సవాలు, నిజమైన భక్తిని చాటిచెబుతాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పడతాయి బోనాలు. ఆషాఢం రావడంతోనే హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం రెట్టింపవుతుంది. అమ్మోరు తల్లి జాతరతో జంటనగరాలు పులకించిపోతాయి. ఈ సందడిలో పాలుపంచుకోవడానికి తెలంగాణ జిల్లాల నుంచి భక్తులూ తరలి వస్తుంటారు. ప్రధాన ఆలయాలతోపాటు నగరవ్యాప్తంగా ఉండే గ్రామదేవతల గుళ్లలోనూ బోనాల సందడి మిన్నంటుతుంది. సాధారణంగా, ఆషాఢంలో వానలు జోరందుకుంటాయి. వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. వాటినుంచి రక్షణ కల్పించాలని అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైంది. అంటువ్యాధులకు అడ్డుకట్టవేసే పసుపు, వేప మండలను బోనాల సందర్భంగా విరివిగా వాడటం గమనించవచ్చు.
బోనం:
బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే బోనాన్ని ప్రత్యేకంగా తయారుచేస్తారు. తెల్లవారుజామున తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి, మడికట్టుకొని కొత్తకుండలో బియ్యం, పాలు, నెయ్యి, చక్కెర కలిపి నైవేద్యం తయారుచేస్తారు. ఈ కొత్తకుండకు సున్నంరాసి, చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. దాని పైభాగం వేపాకు మండలు ఉంచుతారు. కుండపై గండదీపం పేరిట జ్యోతిని వెలిగిస్తారు. ఇలా పవిత్రంగా తయారు చేసుకున్న బోనాన్ని తలపై ధరించి డప్పుల వాయిద్యాలతో పాటలు పాడుకొంటూ, లయబద్ధంగా నృత్యం చేస్తూ, దేవాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
పోతరాజు:
బోనాల పండుగలో పోతరాజు వీరంగం నయన మనోహరంగా ఉంటుంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, దుర్గమ్మ, ఐదమ్మ, కాళెమ్మలకు ఒకే ఒక ముద్దుల తమ్ముడు పోతరాజు. తెలంగాణ పల్లెల పొలిమేరల్లో అదృశ్యంగా కాపలాకాస్తూ ఉంటాడని విశ్వసిస్తారు. బోనాల సమయంలో యువకులు ఒళ్లంతా పసుపు పూసుకొని, పోతరాజుగా అలంకారం చేసుకొని కొరడా ఝళిపిస్తూ, తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ ఊరంతా తిరుగుతారు. ఇలా పోతరాజు వీరంగం ఆడితే దుష్టగ్రహాలు పారిపోతాయని ప్రజల నమ్మకం.
రంగం:
బోనాల పండుగ మరుసటి రోజు ఘటాల ఊరేగింపు జోరుగా సాగుతుంది. తర్వాత రంగం అనే కార్యక్రమం జరుగుతుంది. మట్టితో చేసి కాల్చిన పచ్చికుండను మంటపంలో ఒక అడుగులోతున పాతిపెడతారు. ఒక కొత్త చేటను దానిపై పెట్టి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేస్తారు. దానిపై మాతంగి కన్య నిలబడి భవిష్యత్తులో జరిగే పరిణామాలు, ముఖ్యవిశేషాలను చెబుతుంది. దీన్నే అమ్మమాట, భవిష్యవాణి అని కూడా పిలుస్తారు. ఆ ఏడాది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతుంది. మాతంగి కన్య చెప్పే విషయాలను అమ్మ ఆనతిగా పరిగణిస్తారు భక్తులు.
బలిగంప:
రంగం పూర్తయ్యాక వంశపారంపర్యంగా వచ్చే పోతరాజులు ఆలయం చుట్టూ తిరుగుతూ, తాండవం చేస్తారు. తర్వాత దైవసన్నిధిలోని ప్రసాదం, దీపాల ప్రమిదలు, పూలు మొదలైనవి అన్నీ ఒక గంపలో వేస్తారు. దాన్నే బలిగంప అంటారు. దానిని ఊరి పొలిమేరలో పాతిపెడతారు.
ఘటాలు:
పిల్లలు ఆరోగ్యంతో, పూర్ణాయుష్షుతో ఉండాలని కోరుతూ ఉయ్యాలలా ఊగే తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. వీటినే ఘటాలు అంటారు. వీటిని పూలతో తయారుచేస్తారు. వెదురుబొంగులను రంగురంగుల కాగితాలతో అలంకరించీ తయారుచేస్తారు. మూడు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల ఘటాల వరకూ ఉంటాయి. అమ్మవారికి ఘటాలను పండుగ మర్నాడు డప్పు వాయిద్యాల హోరులో, పాటలు, నృత్యాలతో భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
బోనాల వేడుక హైదరాబాద్‌లో ఆషాఢంలో చేసుకుంటే, తెలంగాణ పల్లెల్లో మఖ కార్తె వచ్చాక చేసుకుంటారు. ఆషాఢమాసం మొదటి ఆదివారం గోల్కొండ జగదంబిక గుడి బోనాలతో భాగ్యనగరంలో ఉత్సవం మొదలవుతుంది. రెండోవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడోవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి సన్నిధిలో, నాలుగో ఆదివారం పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి చెంత బోనాలు వైభవంగా జరుగుతాయి. ప్రధాన ఆలయాలతోపాటు నగరం నలుమూలలా అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.