బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్(76) వేసిన పరువు నష్టం కేసులో నటి కంగనా రనౌత్ సోమవారం అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కంగన నిర్దోషి అని ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. మీడియా జోక్యం వద్దంటూ కంగన చేసిన వినతి మేరకు విచారణ సమయంలో లాయర్లు, మీడియా సిబ్బందిని బయటకు వెళ్లాలని మేజిస్ట్రేట్ ఆర్ఎన్ షేక్ విచారణ ఆదేశించారు.
అనంతరం, ఇరు పక్షాల లాయర్ల సమక్షంలో కంగన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఓ టీవీ షోలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి జావెద్ అక్తర్ తదితరుల కోటరీయే కారణమంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం కంగన అదే కోర్టులో.. ఇంటికి పిలిపించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరించారంటూ జావెద్ అక్తర్‌పై ఫిర్యాదు చేశారు.